హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకానికి కేంద్రం మరో కొర్రీ పెట్టింది. కూలీల పొట్ట కొట్టేలా నిబంధనలను రూపొందించింది. కూలీల హాజరు నమోదు చేయడానికి తీసుకొచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్(ఎన్ఎంఎంఎస్) యాప్ ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. ఈ యాప్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. పనిచేసే ప్రదేశంలో రోజుకు రెండు సార్లు కూలీల ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తేనే పనిచేసినట్టు పరిగణిస్తారు. దీన్నిబట్టే వారికి కూలి కట్టిస్తారు. మొదటి ఫొటోను ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు అవకాశం కల్పించారు. రెండో ఫొటోను మధ్యాహ్నం 2 గంటల నుంచి నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం అప్లోడ్ చేసి వారి వివరాలు మాత్రమే మధ్యాహ్నం తర్వాత కనిపిస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన కూలీకే డబ్బులు వస్తాయి.
సిగ్నల్ లేని ప్రాంతాలే ఎక్కువ
ఒక గ్రామంలో ఒకే సమయంలో కనీసం 4 నుంచి 10 ప్రాంతాల్లో పనులు జరుగుతుంటాయి. వ్యవసాయ పనులు లేని సమయాల్లో ఎక్కువ మంది వస్తే 20-30 ప్రాంతాల్లో కూడా పనులు జరుగుతుంటాయి. దీంతో ఒక్క ఫీల్డ్ అసిస్టెంటే ఫొటోలు తీసి ఉదయం 11 గంటల లోపు నమోదు చేయటం కష్టంగా మారుతున్నది. ఉపాధి పనులు ఎక్కువగా కొండలు, గుట్టలు, గిరిజన ప్రాంతాల్లోనే జరుగుతుంటాయి. ఆ చోట్లలో సెల్ సిగ్నల్ ఉండదు. ఇంటర్నెట్ రాదు. యాప్ పనిచేయక, ఫొటో తీయటం సాధ్యం కాదు.
తొలి రోజు తక్కువగా నమోదు
ఈ యాప్ నిబంధన అమల్లోకి వచ్చిన తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు అత్యధికులు ఈ యాప్‌లో హాజరు నమోదు చేయలేకపోయారు. దీంతో కూలీలు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. వీటికి పరిష్కారం చూపకుండా ఉపాధి హామీ భారాన్ని తగ్గించుకోవడానికి కుట్రల్లో భాగంగానే కేంద్రం ఇలాంటి పనులు చేస్తుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ యాప్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.