PEGEPL : రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు అసమర్థత కారణంగా మరో కంపెనీ తెలంగాణ నుంచి తరలిపోతున్నది. దీన్ని తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి మరో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ‘ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (PEGEPL)’ తన 4 GW సోలార్ PV TOPCon సెల్ తయారీ కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులోని నాయుడుపేట పారిశ్రామిక పార్కుకు మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది.
గత సంవత్సరం తెలంగాణలో 4 GW సెల్ సౌకర్యం, 4 GW మాడ్యూల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. భవన నిర్మాణ అనుమతుల కోసం కూడా దరఖాస్తు చేసింది. అయితే ఇప్పుడు దానికి బదులు కంపెనీ ఏపీని ఎంచుకున్నట్లు తెలిసింది. ఇది తెలంగాణ నుంచి వ్యాపారాలు మకాం మార్చే ధోరణిని సూచిస్తోంది. ఇంతకుముందు కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ తన యూనిట్‌ను తెలంగాణ నుంచి తమిళనాడుకు మార్చగా.. కేన్స్ సెమికాన్ తన చిప్ అసెంబ్లీ యూనిట్‌ను గుజరాత్‌కు మార్చింది.
ప్రధాన కంపెనీల వలసలు రాష్ట్రంలో తగ్గుతున్న పెట్టుబడి వాతావరణాన్ని తెలియజేస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. పరిశ్రమలు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు మారుతున్న నేపథ్యంలో.. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి వాతావరణాన్ని కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. BRS పాలనలో (2014-2023) తెలంగాణ వేగవంతమైన పారిశ్రామిక వృద్ధిని సాధించింది. TG-iPASS కింద 25,146 పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఆ కంపెనీల ద్వారా రూ.2.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 18.3 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది.
ఇంతకుముందు రాష్ట్రం ప్రతి నెలా పారిశ్రామిక, తయారీ రంగాలలో స్థిరంగా 2-3 ప్రధాన పెట్టుబడులను ఆకర్షించింది. 2023-24లోనే 2,672 పరిశ్రమల ద్వారా రూ.28,135 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 84,901 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 1,901 యూనిట్లకు అనుమతులు లభించాయి. రూ.12,626 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కేవలం 49,384 ఉద్యోగాలు వచ్చాయి. పెట్టుబడుల వేగం గణనీయంగా తగ్గింది. రూ.9,646 కోట్ల విలువైన 882 యూనిట్లకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఈ ఏడాది మొత్తం పెట్టుబడులు గత గణాంకాల కంటే తగ్గుతాయని అంచనాలు వెలువడుతున్నాయి.