హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం మళ్లీ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఇప్పటికే వేర్వేరుగా విచారణలు, ఇంజినీర్లు, నిపుణులతో కమిటీలను సర్కారు నియమించింది. తాజాగా జస్టిస్ పీసీ ఘోష కమిషన్ సమర్పించిన నివేదికపై కూడా అధ్యయనం కోసం ముగ్గురు అధికారులతో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ అధ్యయన నివేదికను 4వ తేదీన క్యాబినెట్‌కు సమర్పించాలని సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై జ్యూడిషియల్ విచారణకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ 17 నెలలపాటు విచారణ కొనసాగించి ఇటీవలనే నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. మూడు వాల్యూమ్లుగా.. దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను కమిషన్ నుంచి సీల్డ్కవర్లో స్వీకరించిన ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా దానిని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అందజేశారు. తాజాగా ఆ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డికి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ శుక్రవారం అందజేశారు.
4న క్యాబినెట్‌కు నివేదిక
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలోని అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించింది. నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయ శాఖ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలోని సాంకేతిక, తదితర అంశాలను పరిశీలించనున్నది. నివేదికతోపాటు కమిషన్ వెల్లడించిన ముఖ్యమైన అంశాలతో కూడిన అధ్యయన రిపోర్టును 4వ తేదీన రాష్ట్ర క్యాబినెట్‌కు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. క్యాబినెట్లో చర్చించి ఆమోదించిన అనంతరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే పలు కమిటీలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోని రెండు పిల్లర్లు కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏ హడావుడిగా రంగంలోకి దిగింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ ప్రాజెక్టుపై మధ్యంతర నివేదికను అందజేసింది. ఆ నివేదికను అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటుచేసింది. ఇరిగేషన్ శాఖ అధికారులతో ఒక కమిటీని, నిట్, ఐఐటీహెచ్ తదితర విషయ నిపుణులతో మరో కమిటీని ఏర్పాటుచేసింది. మరోవైపు, ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో ప్రత్యేకంగా విచారణ చేయించింది. అదే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసేందుకు మరోసారి కమిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.