KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుపై మరో కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి, ఒక గంటపాటు ట్రాఫిక్ రద్దీకి కారకులయ్యారంటూ కేటీఆర్‌పై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ ఎస్సై గోవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ 221,292,126(2) రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు గురువారం విచారణకు పిలవడంతో కేటీఆర్.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. తిరిగి అక్కడినుంచి సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో బయలుదేరారు.
ఆ సమయంలో తమతో మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కేటీఆర్‌ను కోరారు. దీంతో కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనం నెమ్మదిగా వెళ్లింది. అయితే, బందోబస్తులో ఉన్న పోలీసులు ట్రాఫిక్ రద్దీ అవుతుందని, ముందుకు వెళ్లాలని కేటీఆర్‌కు సూచించారు. కేటీఆర్ తన వాహనాన్ని ఆపి మీడియాతో మాట్లాడుతూ.. ట్రాఫిక్‌జామ్ అయినా పట్టించుకోలేదని, ముందుకు వెళ్లమన్నందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగారని కేసు నమోదు చేశారు. రోడ్డు నంబర్ 12లోకి వెళ్లిన తరువాత అదనంగా మరో 30 మంది పార్టీ కార్యకర్తలు చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనలో బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్, గెల్లు శ్రీనివాస్, జయసింహ, క్రిశాంక్‌పై కూడా కేసు నమోదు చేశారు.