Street Dogs | ఇబ్రహీంపట్నంరూరల్/తెలుగు యూనివర్సిటీ/ మణికొండ/వరంగల్ చౌరస్తా/ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 9 : రాష్ట్రంలో కుక్కల దాడిలో పసిప్రాణాలు రాలిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని రాయపోల్‌కు చెందిన శివకుమార్ మాధురి దంపతుల కుమారుడు కియాన్ష్ (4) నెల రోజుల క్రితం వీధికుక్కల దాడిలో గాయపడ్డాడు. వెంటనే నగరంలోని దవాఖానలో చికిత్స చేయించగా వైద్యులు కుట్లువేశారు. ఇన్ఫెక్షన్ కారణంగా బాలుడు అనారోగ్యానికి గురికాగా నిలోఫర్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. నిలోఫర్ ఘటన మరువక ముందే నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట సబితానగర్‌లో మానసికస్థితి సరిగాలేని ఓ బాలుడి మర్మాంగంపై కుక్కలు దాడి చేశాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వలసకూలీలు రాజు, అంజమ్మ దంపతుల పెద్దకుమారుడు భరత్(07) మానసికవైకల్యంతో మంచానికే పరిమితమైయ్యాడు. ఇంట్లో మంచంపై పడుకున్న భరత్‌పై వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న బాలుడిని నార్సింగిలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి కొంతమెరుగ్గా ఉన్నా 48 గంటలు గడిస్తేకానీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.
వరంగల్ ఎంజీఎంలో మానవత్వం మంటగలిసేలా మూడురోజుల శిశువు మృతదేహాన్ని పోలీసు ఔట్‌పోస్టు పక్కనే గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శుక్రవారం సాయంత్రం శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుడాన్ని గమనించిన ఔట్ పోస్టు సిబ్బంది విషయాన్ని వైద్యాధికారులు, మట్టెవాడ పోలీసులకు సమాచారం అందజేశారు. ఎంజీఎం వైద్యాధికారులు మృతదేహాన్ని పరిశీలించి శిశువు వయస్సు మూడు నుంచి నాలుగు రోజులు ఉంటుందని, శిశువు జననం హాస్పిటల్లో జరిగినట్టుగా గుర్తించారు. శిశువు మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి మార్చురీలో భద్రపరిచారు. శిశువు శరీర భాగాలను కుక్కలు చీల్చడంతో ఆడ, మగ అనే విషయాన్ని కూడా గుర్తించలేని స్థితికి చేరుకుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని గురువారం ఒకేరోజు ఏడుగురు చిన్నారులపై పిచ్చి కుక్క దాడి చేసింది. శుక్రవారం మరొకరిపై దాడి చేసింది. గ్రామస్థులు కర్రలతో దాడి చేయగా కుక్క మృతి చెందింది.