హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్టు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 152 ఆర్టీసీ అద్దె బస్సులను మండల మహిళా సమాఖ్యలకు ఇచ్చామని, మరో 448 అద్దె బస్సులను మహిళా సంఘాలకే అప్పగించే ప్రక్రియ చివరి దశలో ఉన్నదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి లేఖ రాశారని పేర్కొన్నారు. మండల మహిళా సమాఖ్యలు 448 బస్సుల కొనుగోలు పూర్తిచేసి, వాటిని ఆర్టీసీకీ అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు. దీనికి అవసరమైన అనుమతులు మంజూరైన వెంటనే.. బస్సులను ఆర్టీసీ అప్పగించనున్నట్టు స్పష్టంచేశారు. ఈ నిర్ణయంతో మహిళలకు నిరంతర, స్థిరమైన ఆదాయ మార్గాలను సృష్టించడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.