హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఉద్యోగ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. డిసెంబర్లో టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నది. మరో 207 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను ఇచ్చింది. ఈ మేరకు గురువారం టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. వెటర్నరీ డిపార్ట్మెంట్లో 185 అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ, బీ) పోస్టులకు ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.
హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 22 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తు తేదీల పొడిగింపు ఉండబోదని, అభ్యర్థులు చివరిరోజు వరకు వేచి చూడకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు https://www. tspsc. gov.inలో సంప్రదించాలని సూచించారు.