బొడ్రాయిబజార్, జూన్ 30: సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ జెండా పట్టి తొమ్మిదేండ్లు అవుతు న్నా తనకు పార్టీలో సరైన గుర్తింపు లేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి త్వరలో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్టు బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వల్దాస్ ఉపేందర్ ప్రకటించారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. బీజేపీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. బీజేపీలో దళితులకు గుర్తింపు లేదని, ఎప్పటికైనా గుర్తింపు రాకపోదా అని ఆశతో ఎదురు చూ శానని, కానీ ఆ నమ్మకం పోయిందని చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గంలో గతంలో ఏ ఎమ్మెల్యే కూడా మంత్రి జగదీశ్‌రెడ్డి మాదిరిగా అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు జరుగుతున్న ప్రగతి పనులను తాము కండ్లారా చూస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు కేవ లం బీఆర్ఎస్ పార్టీ వారి కే వస్తాయని అపోహలు పెట్టుకున్నామని, కానీ.. తాను బీజేపీలో ఉన్నప్పటికీ ఎస్సీ కార్పొరేషన్ లోన్, వైద్యానికి రూ.2.5 లక్షల ఎల్వోసీ, తన కుమార్తె వివాహానికి కల్యాణలక్ష్మి వచ్చినట్టు తెలిపారు. బీజేపీలో క్రైస్తవులకు సముచిత స్థానం లేదని, మంత్రి జగదీశ్‌రెడ్డి ఎస్డీఎఫ్ నిధులు రూ.1.50 కోట్లతో చర్చిలను అభివృద్ధి చేయడంతోపాటు సమాధుల తోటకు నాలుగున్నర ఎకరాల భూమి కేటాయించి రూ.50లక్షల నిధులు మంజూ రు చేశారని వివరించారు. క్రైస్తవ భవనానికి రెండెకరాల స్థలాన్ని ఇచ్చిన ఘనత మంత్రి జగదీశ్రెడ్డిదేనని చెప్పారు. ఇంత అభివృద్ధి చేస్తున్న జగదీశ్‌రెడ్డి వెంట నడిచేందుకు తామంతా బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేసిన వారిలో మైనార్టీ నాయకులు బలుగూరి రాజు, ఓబీసీ మోర్చా పట్టణ కార్యదర్శి సోమగాని లక్ష్మణ్, మహేందర్, మహేశ్ ఉన్నారు.