చిక్కడపల్లి, జూలై 27: కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేస్తామని నిరుద్యోగ యువకులు ప్రకటించారు. పలువురు నిరుద్యోగులు శనివారం హైదరాబాద్ అశోక్‌నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రూప్ 1 మెయిన్స్‌లో 1:100 చొప్పున ఎంపిక చేయాలని నిరుద్యోగ నాయకుడు జనార్దన్ డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ ఇదే చిక్కడపల్లిలో విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల నిర్బంధం, అరెస్టులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని విజన్ ఐఏఎస్‌లో కూడా వారు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారికి భిక్షం వేసిన యువతిని అరెస్టు చేయడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. తననెందుకు అరెస్టు చేస్తారని ఆ యువతి ప్రశ్నిస్తూ, ఎంతకూ రాకపోవడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అనంతరం భిక్షాటన చేస్తున్న నిరుద్యోగులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అర్జున్, నర్సింహ, ఇందిరానాయక్ తదితరలు ఉన్నారు.