BRS | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు మీదున్నది. జెట్ స్పీడ్‌తో కారు దూసుకెళ్తుండగా.. ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, స్పష్టమైన మ్యానిఫెస్టోతో గులాబీ పార్టీ ప్రజల్లోకి వెళ్లగా.. పలు దఫాలుగా అభ్యర్థులను ఖరారు చేస్తూ.. రెబల్స్‌కు గాలం వేస్తూ కాంగ్రెస్, బీజేపీ చతికిలపడ్డాయి. అటు ప్రచారంలోనూ బీఆర్ఎస్కు ఎదురేలేకుండా పోయింది. స్వయంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కదనరంగంలోకి దిగారు. ఇప్పటికే సగం తెలంగాణను ఆయన చుట్టేశారు. తన ప్రసంగాలతో అభ్యర్థులకు గెలుపుపై ధీమా ఇస్తూ గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.
– హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)
టికెట్ దక్కలేదని రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన గులాబీ నేతల్లో చాలామంది ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. దీంతో ఎన్నికల ప్రచారం మరింత జోరందుకున్నది. తిరుగుబాట్లు, అలకలు, అసమ్మతి సెగలు కాంగ్రెస్‌ను ఇంకా వీడటం లేదు. బీజేపీ పార్టీ మరింత వెనుకబడిపోయింది. అభ్యర్థులు దొరక్క నానా కష్టాలు పడ్డ కమలం ఆంధ్రా పార్టీ జనసేనకు కొన్ని సీట్లు అంటగట్టింది. కాంగ్రెస్ దశల వారీగా డిక్లరేషన్ల పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేయగా.. బీజేపీ మ్యానిఫెస్టో ముచ్చటే వినిపించడం లేదు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలను అమలు చేస్తున్నదంటూ ఆ పార్టీ ప్రచారం చేయగా.. గ్యారెంటీల అమలులో అక్కడి ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చింది. మరోవైపు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి.. తమ రాష్ట్రంలో 5 గంటల విద్యుత్తు మాత్రమే ఇస్తున్నట్టు పేర్కొన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. కర్ణాటకలో విఫలమైన కాంగ్రెస్.. తెలంగాణలో ఏ విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని ప్రజలు ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభలకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. తన పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రసంగాల్లో వివరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్‌రావు పార్టీ అధినేతకు సమాంతరంగా రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభ్యర్థులు, శ్రేణులు అలుపెరుగకుండా సాగిస్తున్న విస్తృత ప్రచారంతో రాష్ట్రమంతా గులాబీ గుబాళిస్తున్నది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్లు ఇవ్వడం బీఆర్ఎస్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దానిని సానుకూలంగా మలుచు కోవాలని కాంగ్రెస్, బీజేపీ భావించగా.. వారి అంచనాలు తారుమారు అయ్యాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థుల ఎంపిక గొడవలు తారస్థాయికి చేరుకొన్నాయి. పార్టీ టికెట్లు అమ్ము కున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కీలక నేతలు ఆ పార్టీని వీడారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, పీ విష్ణువర్ధన్ రెడ్డి, సంగిశెట్టి జగదీశ్వర్, కురవ విజయకుమార్, మానవతారాయ్, గాలి విజయకుమార్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. టికెట్ ఆశించి భంగపడిన జంగా రాఘవరెడ్డి, కాసుల బాల్‌రాజ్, బెల్లయ్యనాయక్ వంటి 25 మంది నేతలు ఆయా నియోజక వర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. మరోవైపు డిపాజిట్లు కూడా రాని పాతబస్తీ సీట్లను అంట గట్టడంతో బీసీ నేతలు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాగా, పోటీ చేసేందుకు బీజేపీ నేతలు జంకుతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మురళీధర్‌రావు లాంటి ముఖ్యనేతలంతా పోటీకి నిరాకరించారు. ప్రధాని మోదీ రెండు సభలు నిర్వహించినా స్పందన లేకపోవడంతో కమలం పూర్తిగా డీలా పడిపోయింది.
అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అడుగిడటంతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. తెలంగాణ రాకముందు గ్లోబల్‌స్థాయి పరిశ్రమలు నగరంలో ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం తర్వాతనే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక పెద్దపెద్ద కంపెనీలు వచ్చాయి. పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ పరిశ్రమలు, అత్యంత సాంకేతిక నైపుణ్యంతో కూడిన కంపెనీలు క్యూ కట్టాయి. వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడంతో పాటు ఎంతో మంది యువత పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. నిరంతర విద్యుత్, నీటి సౌకర్యం, రవాణా తదితర మౌలిక వసతులతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
– గడ్డికొప్పుల రవి కిశోర్, బండ్లగూడ జాగీర్
నగరంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నది. ఉపాధి కోసం హైదరాబాద్‌కు ఇతర రాష్ర్టాల నుంచి ఎంతో మంది వస్తున్నారు. రోజువారీ కూలీ నుంచి ఐటీ ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకున్నది భాగ్యనగరం. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి టీ దుకాణం పెట్టుకుని కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాను. రోడ్లు, పార్కులు, రవాణా, తాగునీరు ఇలా అన్ని మౌలిక వసతులు కల్పించింది ప్రభుత్వం. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతుండటంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో 10 ఏండ్లలో జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
– వల్లూరు రామచంద్రం, బాలాజీనగర్, మేడ్చల్
హైదరాబాద్ ప్రజలకు ఆహ్లాదం.. ఆనందం పంచేలా ప్రభుత్వం నగరంలో అనేక పార్కులను నిర్మించింది. హుస్సేన్ సాగర్ తీరంలో 10 ఎకరాల విస్తీర్ణం, రూ.26 కోట్లతో అత్యాధునిక హంగులు, అద్భుత డిజైన్లతో ఏర్పాటు చేసిన లేక్ ఫ్రంట్ పార్కు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. అండర్‌పాస్ ఎలివేటెడ్ వాక్ వేస్, వాటర్ చానల్ డెక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పచ్చదనం కోసం 40 రకాల మొక్కలు పెంచుతున్నారు.