ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 11: పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడలో చోటుచేసుకొన్నది. కవితకు ఏడుగురు పిల్లలు. కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్నది. శనివారం రాత్రి పిల్లలతో కలిసి కవిత ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కొడుకు భీంరావ్ (14) చెవిపై పాము కాటేసిందని గుర్తించి, కేకలు వేశాడు.
వెంటనే తేరుకొన్న తల్లి స్థానికులను పిలిచింది. అదే పాము అంతకుముందే ఆరో సంతానమైన దీప (4)ను కూడా కాటేసింది. ఆలస్యంగా గుర్తించడంతో అప్పటికే దీప అపస్మారకస్థితిలోకి వెళ్లి, ఇంటి వద్దే మృతి చెందింది. భీంరావ్ను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.