పెండ్లో, పేరంటమో… పురుల్లో, పుట్టెంటికలో… మనిషి పుట్టిన కాన్నుంచి సచ్చేదాన్క మేం లేంది కార్యమెల్లది. ఇగ మేమెవ్వలమో అర్థమైనట్టే గదా..! అదేనుల్లా మట్టికి రూపమిచ్చే గట్టి మనుషులం. కుమ్మరోళ్లం, కుండల్జేసుకొని మా బతుకు బండ్లను నెట్టుకొచ్చేటోళ్లం. ఉన్నదో లేందో దిని, గట్కనో గంజో తాగి పల్లెటూరి స్వచ్ఛమైన మనుషులతోటి ఇష్టంగా మెదిలినోళ్లం. ఏమైందో, ఏమో.. (వైసు మీద వడ్డది గదా మతికొచ్చి పాడైతలేదు) జనగామ జిల్లా ఆలేరు మండలం నందాపురం కాన్నుంచి ఇగో, గీ జూబ్లీహిల్స్, బోరబండ, అన్ననగర్ బస్తీలొచ్చి వడ్డం. గివే బస్తీ గుడిసెలల్ల మా బతుకులు సాగవట్టి ఏండ్లు గడుస్తున్నది.
ఈ అన్ననగర్ బస్తీల మా బతుకులు మెల్లగా సాగితే ఎవరికేం పట్టి? మా ఇరుకు గల్లీల పొంటనే వాళ్ల బతుకు బండ్లు మాత్రం ఎవరికీ శిక్కకుండా రువ్వడిగ వోతనే ఉంటయి. ఆ బండ్లకు అలుపుండదు, సొలుపుండదు. పగలుండదు, రాత్రుండదు. ఇరాం లేకుండా తిర్గుతనే ఉంటయి. రోగమో, నొప్పో.. ఏనాడూ ఎట్లున్నవవ్వా అని మందలిచ్చినోళ్లుండరు. పదో, పర్కో సాయం జేసేటోళ్లు ఎన్నడూ కనవడరు గనీ, మొన్న పొద్దుగాళ్ల ఎనిమిది గొట్టంగ ఇంటిముందల ఆకిలూడుస్తున్న.
‘ఎల్లవ్వా, ఓ ఎల్లవ్వా… ఉన్నడానవ్వా భిక్షపతి’ అనుకుంటా ఓ గుంపు దూరంలకెళ్లి కీకలేస్తనే ఉన్నది. వంగి ఉన్న నా నడుము ఆ కీకల్ని కొద్దిసేపు ఇరాం దీసుకున్నది. మొన్ననే కన్నాప్రీషనైంది గావట్టి కండ్లు గూడ తేటగ్గనవడ్తున్నయి. నెత్తి మీద టోపీ వెట్టుకొని, భుజాల మీన మూడురంగుల కండ్వాలేసుకొని, శేతులల్ల కాయిదాలు వట్టుకొని నా దగ్గరికి రానే అస్తున్నదా గుంపు. అంతే, నా ఎడమశేతిలున్న శీపిరిగట్ట ఒక్కసారిగ తారుమారైంది. ఇట్లా శీపిరిగట్ట తారుమారైందో లేదో, ఆళ్ల అడుగులు ఎన్కకువడ్తనే ఉన్నయి. నా అడగులు ముందుకువడ్డా కొద్దీ వాళ్లు ఎన్కకు వోతనే ఉన్నరు. ఏమైందో ఏమో.. క్షణంల ఆ గుంపు మాయమైంది. ఓర్నీ, కండ్లు మళ్లా నజరిస్తలెవ్వా ఏందనుకొని రైకలున్న అద్దాల్దీసి కండ్లకు వెట్టుకున్న. అయినా ఆ గుంపు మాత్రం కానరాలేదు.
ఇంతకూ వాళ్లడిగిన భిక్షపతి ఎవ్వలో ఎర్కేనా? ఇంకెవ్వలు నా పెనిమిటే. దగ్గెర దగ్గెర డెబ్బయైదేండ్లకుంటడు గావొచ్చు. ఇంట్లున్నడా మనిషి అంటే లేడు. రాత్రి పదిగొట్టంగా ఇంటి మొకానొస్తే, ఎగిలివారంగా ఏడుగొట్టంగ లేసి, రోడ్డు మీన వడ్తడు. తిండి, ఠిఖానా మొత్తం బయటే. ఏం పన్జేస్తడో ఎర్కేనా? అడుక్కుంటడు. అవును.. భిక్షపతి రోడ్డు పొంటి బిచ్చమడుక్కుంటడు. దుకాన్ల పొంటి, హోటళ్ల పొంటి, రోడ్డు పొంటి వొయ్యేటోళ్ల దగ్గర శేతుజాప్తడు. వైసు మీదుండంగ కుమ్మరి పన్జేసుకుంటా తలెత్తుకొని బతికిన భిక్షపతికి ముసలితనం బుచ్చమడుక్కునేటట్టు జేసింది.
పొద్దున శాయ మొదలు, రాత్రి తినే బువ్వ దాన్క బయటనే అడుక్కుంటడు, బయటనే తింటడు, బయటనే ఉంటడు. పదో పర్కో మిగిలితే నాకే దెచ్చిత్తడు. ఓ వారం రోజుల కిందట.. రాత్రి పదిగొట్టినా భిక్షపతి ఇంటికి రాలె. ఈనె ఇంటికింకా రాకపాయెనని ఎదురుంగ వోయిన. జూబ్లీహిల్స్ మొత్తం ఎన్కులాడినా మనిషి కానరాలె. చూసీ చూసీ కండ్లు కాయల్గాసినయి. తిర్గీ తిర్గీ నాకూ యాష్టకొచ్చింది. ఎహ్హె ఆయనే అస్తడనుకొని ఒక్కశిత్తం జేస్కొని ఇంటికి తిరిగొస్తున్న. ‘ఓ పాలబిందెల ఎల్లవ్వా.. నీ భిక్షపతి బోరబండ బస్తీల కిందవడి ఉన్నడు పో.. అని రోడ్డు పొంటి వొయ్యేటోళ్లు శెప్తే జల్ది ఆడికుర్కిన.
వొయ్యేసరికి కట్టె సర్సుకవడ్డడు భిక్షపతి. మన్షిని జూస్తే గూసినట్టే ఉన్నడు గని, దగ్గర్కి వొయ్యి జూస్తే గూతినవడ్తున్నది. నాకు పోయిన పాణం లేసొచ్చింది. తిర్గీ తిర్గీ నెరివడ్డట్టున్నడు పాపం. బాటిల్ మూతదీసి నీళ్లు మా ఆయన మూతిమీద వోసిన. మనిషి కదులవట్టిండు. పదన తాకేసరికి బంకలు సాగుతున్నయి పెదవులు. ఓ మన్షీ.. ఏమైందుల్లా, గిట్ల నెరివడ్డవ్? అని ఒర్లుతనే ఉన్న. నేనెంత గట్టిగొర్లుతే.. మనిషి అంత గట్టిగ కదులుడు వెట్టిండు. అద్దుమరాత్రి రోడ్డుమీన ఎవ్వలుంటరు? ఉన్నా.. ఎవ్వలెందుకొస్తరు? ఓ పావుగంటైతే గానీ భిక్షపతి మనిషి గాలె. అమాంతం లేవట్టి కూసుండవెట్టిన. దబ్బ దబ్బ బాటిల్ నీళ్లు ఒడగొట్టిండు. అటో ఇటో జేసి కొద్దిసేపైనంక నేనే భిక్షపతిని ఇంటికి వట్కవోయిన.
మాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. ఈ బస్తీలల్లనే అందరి బతుకులు తెల్లారుతయి. ఎవ్వల సంసారాలు ఆళ్లయె. పెద్ద బిడ్డ పెనిమిటి, నడిపి బిడ్డ పెనిమిటీ ఇద్దరూ కాలం జేసిండ్రు. కడుపున వుట్టినోళ్లకు భారం గావొద్దని భిక్షపతి బాధ. అందుకే ఈళ్లదగ్గర తప్పితే అందరిదగ్గరా శెయ్యి జాప్తడు. శాతనయ్యో కాకనో.. నేను ఇండ్ల పొంటి పాశి పన్జేస్తా. మా అసొంటి బీద సాదలకు గవర్నమెంటోళ్లు భరోసాగుంటరని మస్తుమందే అనుకుంటరు. అన్ల వాళ్ల తప్పేముంది? నేను గూడ గట్లనే అనుకొని తప్పు జేసిన.
పాలిచ్చే బర్రెనిడ్శివెట్టి తన్నే బర్రె ఎంబడి వోయిన. రెండేండ్ల కింద పట్నంల ఎలచ్చన్లు నడ్శినప్పుడు గీ కాంగిరేస్ నాయకులు పట్నం మొత్తం కాల్గాలిన పిల్లోలె తిర్గుడు వెట్టిన్రు. బోరబండ మీటింగ్కు మాకు పైసలిచ్చీ మరి పట్కవోయిన్రు. ఆ మీటింగ్ల ఈ కాంగిరేస్ నాయకులు మాటలతోని కోటల్గట్టిన్రు.
ఓటేసి మీరు మమ్మల్ని గెల్పిస్తే, నోట్లేస్తూ మిమ్మల్ని మేం గెల్పిస్తమని భరోసా ఇచ్చిన్రు. ఇంటికిద్దరికి పింఛన్లు ఇస్తమని మాయజేసిన్రు. అంతేగాదు.. నెత్తికి నాల్గు వేల పింఛన్ ఇస్తమని నక్రాల్జేసిన్రు. ఆ మాటలినే గదా నేను, నా భిక్షపతి శేతి గుర్తుకోటేసి శేయి గాల్సుకున్నం. నాల్గు వేలేమో గానీ, ఈ కాంగిరేస్ సర్కార్ శేతిగుంట నయా పైసా ఎర్కలే. భరోసా మాటేమో గానీ, మాకే ఉల్టా బాకీ వడి మా బతుకులను ఆగం జేస్తున్నది కాంగిరేస్ పార్టీ.
గీ కాంగిరేసోళ్లు ఎలచ్చన్ల ముందట మాటిచ్చినట్టు.. శాతగాని మా ఇద్దరాలుమొగల పాణాలకు నెత్తికి నాల్గు వేల పింఛనిస్తే ఎంత ఆసరాగా ఉంటుండె? నా భిక్షపతి బిచ్చమడుక్కుంటుండెనా? నేను ఇంటింటికి పాశి పని జేయవోతుండెనా? రెండేండ్ల గుత్త కంటికి కనవడని కాంగిరేసోడు మళ్లా ఎలచ్చొన్లొచ్చేసరికి బస్తీకి లైన్ గడ్తున్నడు? బిచ్చమడుక్కునే భిక్షపతి దగ్గర్కే బిచ్చం కోసం అస్తున్నడు. ఇక్కడున్న కాంగిరేసోడే గాదు, సెంటర్లున్న బీజేపోడొచ్చినా శీపిరిగట్ట మర్లేసుడే..
– గడ్డం సతీష్
99590 59041