లింగంపేట, అక్టోబర్ 3: రుణమాఫీ పేరిట సర్కార్ రైతులు మోసగించిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా లింగంపేటలో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. షరతుల్లేకుండా రుణమాఫీ, రైతుభరోసా అమలు, పంటలకు బోనస్ ఇవ్వాలని కోరుతూ మహాధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న రేవంత్ 300 రోజులు దాటినా అమలు చేయలేదని విమర్శించారు. లింగంపేట మండలంలో 3,972 మంది రైతులకు గాను 1,400 మందికి మాత్రమే మాఫీ చేసి, మిగతా వారికి ఎగ్గొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్కు వలసలు వెళ్లిన ప్రజలు మూసీ పరీవాహక ప్రాంతాల్లో గృహాలు నిర్మించుకున్నారని.. ఆ రోజు ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన పేరిట ముఖ్యమంత్రి రేవంత్.. కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్రెడ్డి సద్దులు, సంచులు మోయడానికే ఢిల్లీ వెళ్తున్నాడు తప్పితే అక్కడి నుంచి తీసుకువచ్చింది ఏమీ లేదని అన్నారు.