మద్దిరాల, సెప్టెంబర్ 13 : ఆరోగ్యం విషయమై ఏఎన్ఎం మందలించిందని మనస్తాపం చెందిన కేజీబీవీ విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఎస్సై వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన బీసు గీతిక మద్దిరాలలోని కేజీబీవీలో 6వ తరగతి చదువుతున్నది. పాఠశాలలో ఆమె తరచూ అనారోగ్యానికి గురయ్యేది. ‘నీకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది’ అని విద్యార్థిని ఏఎన్ఎం మందలించింది. మనస్తాపం చెందిన విద్యార్థిని శుక్రవారం తెల్లవారుజామున పాఠశాల భవనం మొదటి అంతస్థు నుంచి కిందికి దూకింది. గమనించిన కొందరు విద్యార్థులు డ్యూటీలో ఉన్న టీచర్‌కు చెప్పారు. అప్పటికే కింద పడిపోగా గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. గాయాలు తీవ్రం కావడంతో మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఒక కాలు విరగడంతోపాటు వెన్నుపూస దెబ్బతిన్నట్టు వైద్యులు తెలిపారు. దీనిపై పాఠశాల ప్రత్యేక అధికారి తేజశ్రీని వివరణ కోరగా వాష్ ఏరియాలో జారి పడినట్టు చెప్పారు. ఈ ఘటన ఉదయం జరిగినా ఎవరికి తెలియకుండా సాయంత్రం వరకు గోప్యంగా ఉంచారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గణేశ్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న మూడు జిల్లాల్లో సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. 17న ఇచ్చిన సెలవుకు గాను నవంబర్ 9న రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.