గద్వాల, జూలై 9 : కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని జోగుళాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ సమన్వయకర్త, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన జోగుళాంబ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులు ఉండవని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని అడుక్కుంటున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ను ప్రజలకు దూరం చేయాలని కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదని.. అది వారి వల్ల కాదని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ నుంచి నడిగడ్డ ప్రజలను దూరం చేయలేరని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జెడ్పీటీసీ స్థానాలతోపాటు జెడ్పీ చైర్మన్ పదవిని సైతం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 15న గద్వాల జిల్లా కేంద్రంలో ప్రజాఆత్మగౌరవ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నట్టు తెలిపారు.
దళితులు, రైతులు, కౌలు రైతుల ఆత్మగౌరవసభలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సభల్లో కాంగ్రెస్ హామీల పేరిట చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ ఏర్పాటు తర్వాత దానిని పూర్తిచేసి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బంగ్లా-బండ్లను ఓడించాలని పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు బండ్లను భుజాలపై ఎత్తుకొని మోస్తున్నాడని విమర్శించారు.
బండ్ల-బంగ్లా-ఎనుముల అంతా ఒకే వర్గానికే చెందిన వారని.. వీరంతా కలిసి సబ్బండ వర్ణాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల ప్రజలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించలేదని.. కారు గుర్తును చూసి ఓట్లు వేశారని తెలిపారు. నడిగడ్డలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అనుకునే వారికి త్వరలో చెంప పగిలేలా ఉద్యమం చేస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు వెంకట్రాములు, విష్ణువర్ధన్‌రెడ్డి, కురువ పల్లయ్య, హనుమంతు నాయుడు తదితరులు పాల్గొన్నారు.