హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టులో సాంకేతిక, ఆర్థిక అంచనాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నదని, సంబంధిత అధికారులు నది పరీవాహకంలో ఉన్న రాష్ట్రం (తెలంగాణ)తో సంప్రదింపులు జరుపుతున్నారని రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఆ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ ఆగబోదని, కో బేసిన్ రాష్ర్టాలు, అధికారులతో సంప్రదింపులను కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. రాజ్యసభలో సోమవారం కాంగ్రెస్ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్ గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై పలు ప్రశ్నలను సంధించారు.
తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతున్నాయనే విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసా? తెలంగాణ తీవ్రంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టును కేంద్రం నిలిపేస్తుందా? లేదంటే అందుకు గల కారణాలను వెల్లడించాలి అని ఆయన కోరారు. దీనికి జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి సమాధానమిచ్చారు. ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను సాంకేతిక, ఆర్థికపరమైన సాధ్యాసాధ్యాల అంచనా కోసం కేంద్రానికి సమర్పించిందని వెల్లడించారు.
లింక్ ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఏపీ తెలియజేసిందని వివరించారు. ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలు కేంద్రానికి అందాయని చెప్పారు. పీఎఫ్ఆర్ టెక్నో, ఎకనామిక్ సాధ్యాసాధ్యాల పరిశీలనకు తెలంగాణ అభ్యంతరాలు వర్తించబోవని తెలిపారు. ప్రాజెక్ట్ సాంకేతిక-ఆర్థిక అంచనా కోసం సంబంధిత అధికారులు, కో బేసిన్ రాష్ట్రంతో సంప్రదింపుల ప్రక్రియను కేంద్రం కొనసాగిస్తున్నదని స్పష్టం చేశారు.
గతంలో ప్రాజెక్టుపై కేంద్రంతో సంప్రదింపులు కొనసాగడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు వెల్లడించారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలోనూ ప్రాజెక్టుపై చర్చే జరగలేదని, కాబట్టి అడ్డుకుంటామనే ప్రస్తావనే రాలేదని ప్రకటించారు. కానీ కేంద్రం అందుకు విరుద్ధంగా ప్రాజెక్టుకు సంబంధించి సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించడం గమనార్హం. తెలంగాణ అభ్యంతరాలు పీఎఫ్ఆర్ అనుమతికి వర్తించబోవని ప్రకటించడం కొసమెరుపు.