మన్సూరాబాద్, మే 23: హైదరాబాద్ మహానగరం పరిధిలోని కుంట్లూరు న్యూ జీవీఆర్ కాలనీలో నిహారిక నివాసం ఉంటున్నది. ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నది. గురువారం నిహారిక ఆనంద్‌నగర్ చౌరస్తా మీదుగా తన ఇద్దరు పిల్లలతో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుంతలమయమైన రోడ్డుపై వాహనం అదుపు తప్పి ముగ్గురూ కిందపడ్డారు. ఈ ఘటనలో వారికి స్వల్పగాయాలయ్యాయి.
వెంటనే తేరుకున్న ఆమె ఇద్దరు పిల్లల్ని ఇంటి వద్ద వదిలి తిరిగి ప్రమాదం జరిగిన చోటుకు వచ్చింది. మార్పు రాని ఈ పాలనలో పాలకులకు కనువిప్పు కలిగించాలనుకున్నది. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రోడ్డుపై గుంతల్లో నిలిచిన బురద నీటిలో కూర్చొని వినూత్న నిరసనకు దిగింది.
‘రోడ్లు బాగు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి’ అన్న ప్లకార్డును ప్రదర్శిస్తూ అరగంటపాటు బురదనీటిలో కూర్చొని నిరసన తెలిపింది. గుంతలమయంగా మారిన రోడ్లతో ఎందరో ప్రమాదాల బారినపడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె నిరసనను ఎక్స్‌లో ట్వీట్ చేయగా అది ఇప్పుడు వైరల్‌గా మారింది. నిహారిక నిరసన ఫొటోలు వివిధ సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
భీష్మించిన మహిళ.. స్పందించిన కార్పొరేటర్
రోడ్డుపై నీటి గుంతలో నిరసన తెలుపుతున్న విషయం తెలిసి అక్కడి ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకున్నా ఆమె తన పట్టు వదలలేదు. జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఈ విషయం తెలుసుకున్న నాగోల్ కార్పొరేటర్ ఘటనా స్థలానికి చేరుకొని రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరైనా ఎన్నికల కోడ్ ఉన్నందున పనులు చేపట్టలేదని ఆమెకు వివరించారు. కోడ్ ఎత్తివేయగానే రోడ్లను బాగు చేస్తామని ఆమెకు నచ్చజెప్పారు.
ముందస్తుగా యుద్ధప్రాతిపదికన మట్టితో నీటిగుంతలను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె తన నిరసనను విరమించారు. సాయంత్రం కార్పొరేటర్ చొరవతో అధికారులు గుంతల్లో నిలిచిన నీటిని తొలగించి మట్టితో గుంతలను పూడ్చివేశారు. దీంతో నిహారికను ఆ ప్రాంతవాసులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.