పెద్దవంగర, మే 11 : కొనుగోలు కేంద్రంలో కాంటాలైన ధాన్యాన్ని మిల్లుకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంట పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కొడకండ్ల-అవుతాపురం రహదారిపై లారీకి అడ్డంగా పడుకొని నిరసన చేపట్టారు. తమ సెంటర్కు లారీని తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రంలో చాలా బస్తాలు కాంటాలై ఉన్నా.. మిల్లులకు తరలింపులో రోజుల తరబడి జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
సెంటర్ ఇన్చార్జితో రైతులు వాగ్వాదానికి దిగడంతో లారీని పంపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందని.. కాంటాలైన బస్తాలు సైతం తడవడంతోపాటు చెదలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రంలో కాంటాలు కావాలన్నా.. మిల్లుకు తరలించాలన్నా.. సెంటర్ ఇన్చార్జీకి కొంత డబ్బు ముట్టజెప్పాల్సి వస్తుందని రైతులు ఆరోపించారు. దొడ్డు ధాన్యాన్ని మాత్రమే మిల్లు యాజమాన్యాలు, లారీ గుత్తేదారులు తీసుకెళ్తున్నారని, సన్నధాన్యాన్ని తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్నారని తెలిపారు.