హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ విరమణానంతర ప్రయోజనాలు అందక రిటైర్డ్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటూ ఉద్యోగాల్లేక, ఇటూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక కుటుంబపోషణకు అష్టకష్టాలు పడుతున్నారు. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. అయినా కాంగ్రెస్ సర్కారు కరుణించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు అలవికాని హామీలిచ్చి ఇప్పుడు ఖజానాలో నిధుల్లేవంటూ తప్పించుకుంటున్నదని మండిపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు కాంగ్రెస్ అనేక హామీలిచ్చింది. వేతనాలను రూ.18 వేలకు పెంచుతామని, విరమణాంతర ప్రయోజనాల కింద టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ. లక్ష చొప్పున అందజేస్తామని ఊదరగొట్టింది. కానీ, అధికారంలోకి రాగానే రిటైర్మెంట్ వయస్సును 65 నుంచి 60 ఏండ్లకు తగ్గించడంతోపాటు గత రెండేండ్లలో రిటైర్ అయిన దాదాపు 10, 300 మంది అంగన్వాడీ సిబ్బందికి నయాపైసా కూడా బెనిఫిట్స్ ఇవ్వలేదు.
ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదిస్తే.. తమకేమీ తెలియదని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని చెప్తున్నారని రిటైర్డ్ అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను మంత్రికి, ఎమ్మెల్యేలకు విన్నవిస్తే.. త్వరలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చూస్తామని ఊరించడమే తప్ప చేసిందేమీ లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.