ఖైరతాబాద్, జూన్ 12 : రాష్ట్రంలోని 66 వేల మంది అంగన్వాడీలు రెండు నెలలుగా వేతనాలు అందక అప్పులపాలు అవుతున్నారని, ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నదని రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రతినెలా జీతాల కోసం ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. తక్షణమే వేతన బకాయిలు విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇవ్వాలని కోరారు.