తాడ్వాయి, మే 15: అంగన్వాడీ టీచర్ హత్యకు గురయ్యారు. ఈ ఘటన ములుగు జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన రడం సుజాత (48) తాడ్వాయి మండ లం కాటాపురం అంగన్వాడీ సెంటర్-3లో టీచర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం స్వగ్రామం నుంచి కాటాపురానికి చేరుకున్న ఆమె విధులు ముగించుకున్న అనంతరం మధ్యా హ్నం 1.30 గంటలకు ఇంటికి వెళ్లేందుకు బస్టాప్‌కు వచ్చారు. బస్సు వెళ్లిపోవడంతో గుర్తుతెలియని వాహనం ఎక్కారు. బుధవారం ఉదయం కాటాపూర్-తాడ్వాయి రహదారి మధ్యలో నీళ్ల ఒర్రెకు అర కిలోమీటర్ దూరంలో తునికాకు కోసేందుకు వెళ్లిన కూలీలకు ఓ మహిళ మృతదేహం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, పస్రా సీఐ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్‌ను తీసుకువచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి మెడకు స్కార్ప్ చుట్టి ఉండటంతోపాటు తల వెనుక పెద్ద గాయమైంది. హత్యకు గురైంది సుజాతగా గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారంతోపాటు సెల్‌ఫోన్ చోరీకి గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సుజాత కాటాపురం గ్రా మంలో ఎవరి వాహనం ఎక్కి వెళ్లిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.