హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు నీరుగారుతున్నాయి. వాటిని సర్కారు విస్మరించడంతో అక్కడ పని చేస్తున్న టీచర్లు, వర్కర్ల సంక్షేమం అటకెక్కింది. అంగన్వాడీ కేంద్రాలలో పని చేసిన టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ చెంది ఆరు నెలలైంది. ఇంతవరకు వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల సంఘం నాయకులు ఈ విషయంపై పలుమార్లు కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినా ప్రయోజనం శూన్య మైంది. రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.1 లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కరికీ ఇచ్చిందిలేదు. అదేమంటే.. త్వరలోనే జీవో విడుదలవుతుందని ఆ శాఖ మంత్రి చెబుతున్నారు. ఆ జీవో ఎప్పుడు విడుదలతుందో ఎవరికీ స్పష్టతలేదు. దీంతో సర్కారు తీరుపై అంగన్వాడీ టీచర్లు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాలలో పని చేసే టీచర్లను ప్రాజెక్టు ఉద్యోగిగా కాకుండా.. ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న ప్రీ-ప్రైమరీ టీచర్లుగా తమను గుర్తించి, సర్కారు జీతం స్కేళ్లు వర్తింప చేయాలని కోరుతున్నా రు. ఈ ఏడాది జూలై 1 తర్వాత చనిపోయిన టీచర్లు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా బేషజాలకు పోకుండా తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సర్కారు వైఖరికి నిరసనగా తాము ఉద్యమి స్తామని వారు హెచ్చరిస్తున్నారు.