హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లను ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందినవారి స్థానాల్లో కొత్తవారిని భర్తీ చేయకపోవడంతో ఒక్కో అంగన్వాడీ టీచర్‌కు రెండు, మూడు కేంద్రాల బాధ్యతలను అప్పగిస్తున్నారు. పనిభారం పెరిగిపోవడంతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సేవలందించడంలో జాప్యంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు చదువుచెప్పే పరిస్థితిలేకపోవడంతో తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించేందుకు విముఖత చూపుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూరల్, ఆర్బన్ ఏరియాల్లో కలిపి 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యి. వీటిలో 6,399 టీచర్, 7,834 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతినెలా వందల సంఖ్యలో టీచర్లు, హెల్పర్లు రిటైర్ అవుతున్నారు. అయితే, విరమణ పొందిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమించకుండా పొరుగున ఉన్న సెంటర్ల టీచర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. సుమారు ఎనిమిది వేల కేంద్రాలకు ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. మరోవైపు, అంగన్వాడీ టీచర్లకు బీఎల్వోలుగా ఎన్నికల విధులు కేటాయిస్తున్నారు. పనిభారంతో, పర్యవేక్షణ కొరవడి తూతూ మంత్రంగా సెంటర్లను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో టీచర్ రెండు, 3 కేంద్రాల పరిధిలో విధులు నిర్వర్తించాల్సి వస్తున్నదని అంగన్వాడీ టీచర్స్ యూనియన్ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఫేషియల్ రికైగ్నెజేషన్ కు అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సరైన పోషకాహారం, కోడిగుడ్లు, పాలు అందకపోవడంతో పేద, దిగువ మధ్య తరగతికి చెందిన గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం 2025 మేలో మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ కేంద్రాల్లో ఆయాలను నియమించాల్సి ఉన్నది. కానీ, మూడు నెలలు దాటినా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడంలేదని మినీ అంగన్వాడీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టీచర్లపై పనిభారం పెరిగిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, వంటపనులు, పిల్లల సంరక్షణ, లబ్ధిదారులకు పోషకాహారం అందించడం ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే అప్‌గ్రేడ్ అయిన కేంద్రాల్లో హెల్పర్లను నియమించాలని కోరుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలేదు. 2025 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా 14వేలకుపైగా టీచర్లు, ఆయాల పోస్టులు భర్తీచేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.