Telangana | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ‘వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలకు కూర్చున్నా తినొచ్చు’ అన్న సామెత కాంగ్రెస్ పాలనకు సరిగ్గా అతుకుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఓ కాంగ్రెస్ కార్యకర్తకు ఇలాగే మేలు చేసేలా రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో గురుకులాలకు, ఎన్నో ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తక్కువ ధరకే నాణ్యమైన ఫర్నిచర్‌ను సమకూర్చిన ప్రభుత్వ సంస్థను కాదని, నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త ‘దత్తుడి’కి బెంచీల కాంట్రాక్టును ధారదత్తం చేసేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. అదీ బ్లాక్ లిస్టులో ఉన్న కేంద్రీయ భండార్ ముసుగులో ఆ కాంట్రాక్టును అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు వినికిడి. అంగన్వాడీ కేంద్రాలకు బెంచీలను సమకూర్చే ఆ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.
గతంలో సరుకుల సరాఫరాకు ఒప్పందం కుదుర్చుకొనేందుకు ఆ నేత విఫలయత్నం చేసినట్టు తెలిసింది. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన సంస్థకు దొడ్డిదారిలో లబ్ధి చేకూర్చేందుకు సర్కారు యోచిస్తున్నది. ఇందుకు నల్లగొండ జిల్లాకు చెందిన షాడో మంత్రి మల్లన్న ద్వారా రాయ‘బేరం’ కుదిరినట్టు సమాచారం అందుతున్నది. సుమారు రూ.40 కోట్ల విలువైన 75,000 బెంచీలను సమకూర్చే ఆర్డర్లను టెండర్లు పిలువకుండానే నామినేషన్‌పై ఇచ్చేందుకు ఒప్పం దం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. పౌష్టికాహారం, ఇతర సేవల కోసం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే తల్లులు, బాలింతలకు బెంచీలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.
ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించాలని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖను ఆదేశించింది. దీంతో సుమారు 35 వేల కేంద్రాలకు 2024-25 సంవత్సరానికి 75,000 బెంచీలు, టేబుళ్లు అవసరమని గుర్తించారు. దీంతో ప్రభుత్వం వాటిని సమకూర్చేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇదే అదనుగా నల్లగొండ జిల్లాకు చెందిన సదరు కాంగ్రెస్ కార్యకర్త రంగంలోకి దిగారు. ఓ ప్రభుత్వ సంస్థ ముసుగులో షాడో మంత్రి అండదండలతో కాంట్రాక్టును దక్కించుకొనేందుకు పావులు కదుపుతున్నారు. కాంట్రాక్ట్ ఇస్తే ‘చేయూత’ అందిస్తానని అదే జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత ద్వారా రాయబేరం నడిపినట్టు తెలుస్తున్నది.
చంచల్‌గూడ సెంట్రల్ జైలు సంస్థ రాష్ట్రంలోని గురుకులాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఫర్నిచర్ అందజేస్తున్నది. ఫర్నిచర్ తయారీకి ఈ సంస్థకు మానవ వనరులతోపాటు కార్ఖానాలు ఉన్నాయి. కొన్నేండ్లుగా ఖైదీలతో ఉత్పత్తులను తయారు చేయించి ఆర్డర్లు ఇచ్చిన సంస్థలకు సరఫరా చేస్తుంటుంది. ఫర్నిచర్ తయారీలో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుందని జైళ్లశాఖకు మంచి పేరున్నది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం, జైళ్ల నిర్వహణకు ఉపయోగిస్తుంది. కానీ ఇప్పుడు ఆ ఆదాయానికి గండికొట్టే కుట్రలకు ప్రభుత్వమే తెరలేపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంచల్‌గూడ జైలు ఫర్నిచర్ నాణ్యతగా లేదనే సాకుతో ప్రభుత్వ సంస్థ ముసుగులో ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఖైదీల కష్టానికి ఎసరుపెట్టి, సదరు సంస్థ ఆదాయానికి గండికొట్టేందుకు ప్రభుత్వమే పూనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
అంగన్వాడీలకు బెంచీలను సమకూర్చేందుకు ఆసక్తి, అర్హత ఉన్న సంస్థలు ముందుకు రావాలని ప్రభుత్వం ఫిబ్రవరి 18న నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ఫిబ్రవరి 20న కాంగ్రెస్ కార్యకర్త ప్రోద్బలంతో కేంద్రీయ భండార్తోపాటు మరో ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ జైలు, చంచల్‌గూడ, హైదరాబాద్ పేరిట ప్రతిపాదనలు అందాయి. ఇందులో 60 ఇంచుల పొడువు, 15 ఇంచుల వెడల్పుతో కూడిన ఒక్కో బెంచీ యూనిట్‌ను కేంద్రీయ భండార్ రూ.4,907 (మొత్తం జీఎస్టీ, రవాణా ఖర్చులు)కు అందిస్తామని ప్రతిపాదనలు అందించింది. ఇదే టేబుల్‌ను చంచల్‌గూడ సెంట్రల్ జైలు సంస్థ రూ.4,778కి అందిస్తామని, ఒక్కో యూనిట్‌కు రూ.129కి తక్కువకు సమకూరుస్తామని ప్రతిపాదనలు అందజేసింది. మొత్తంగా రూ.96.75 లక్షల మేర తక్కువకు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. అయితే తక్కువకు ఇచ్చే సంస్థను పక్కనబెట్టి, ఆగమేఘాలపై మూడురోజుల్లోనే మానవవనరులే లేని, తయారీకి కార్ఖానాలూ లేని కాంగ్రెస్ కార్యకర్త సంస్థకు కాంట్రాక్టును అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం అనుమానాలు రేకేత్తిస్తున్నది. సదరు నేత ‘సత్తు’ మాయజాలంతోనే అర్హతలేని సంస్థకు ఆర్డర్లు ఫైనల్ చేసేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
కేంద్రీయ భండార్‌పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు 2023 ఏప్రిల్ 10 నుంచి 2025 ఏప్రిల్ 09 వరకు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. ఇంకా గడువు కూడా ముగియకముందే సదరు సంస్థకు బెంచీలను సమకూర్చే బాధ్యతలు అప్పగించేందుకు యత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీకూడా తక్కువకు కోట్ చేసిన ప్రభుత్వ సంస్థను కాదని, కాంగ్రెస్ కార్యకర్తకు చెందిన సంస్థకు ఇవ్వడం వెనుక కమీషన్ల తతంగం సాగినట్టు తెలుస్తున్నది. దీనికి తనవంతు సహకారం అందించేందుకు దత్తుడు అంగీకరించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఆ షాడో మంత్రి మధ్యవర్తిగా వ్యవహరించి చక్రం తిప్పినట్టు వినికిడి. ఆయన సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగినట్టు తెలుస్తున్నది.
అంగన్వాడీ కేంద్రాలకు బెంచీలను సమకూర్చేందుకు గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీచేశాం. ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ భండార్, జైళ్ల శాఖ నుంచి ప్రతిపాదనలు అందాయి. వీటిని పరిశీలిస్తున్నాం. గతంలో కేంద్రీయ భండార్‌కు ప్రభుత్వం పలురకాల ఆర్డర్లు ఇచ్చింది. ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. అర్హతలు ఉన్న సంస్థకే కాంట్రాక్ట్ ఇస్తాం.
– అనితారామచంద్రన్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మహిళా శిశు సంక్షేమశాఖ