హైదరాబాద్, జనవరి 29 : పటిష్టమైన కార్యాచరణతో, పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు తెచ్చిన పథకం.. దళితబంధు! దళితుల సర్వతోముఖాభివృద్ధికి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చూపని చొరవను, తీసుకోని సాహసోపేత నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్నది. ఎంతో బాధ్యతాయుతంగా, మానవీయ కోణంలో చేపట్టిన బృహత్తర పథకం దళితబంధు. ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం.. ఈ పథకానికి కాళ్లల్లో కట్టెలు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఒక పనికిరాని కథనాన్ని వండిపారేసింది. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని ఈ పత్రిక తప్పుపడుతున్నది. దేశంలో, రాష్ట్రంలో, ఆ మాటకొస్తే ప్రత్యేకించి తాను పల్లకీ మోసిన చంద్రబాబు హయాంలో కూడా వివిధ సంక్షేమ పథకాల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలు చేపట్టిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రజ్యోతి విస్మరించినట్టు ఈ కథనంలో స్పష్టంగా తేటతెల్లమవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి చివరికల్లా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు పకడ్బందీ కార్యాచరణ అమలు చేస్తున్నది. నియోజకవర్గానికి 100 దళిత కుటుంబాలను ఎంపిక చేసి, వారికి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి తద్వారా వ్యాపార రంగంలోకి తీసుకురావాలని సర్కారు ప్రయత్నిస్తున్నది. నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అప్పగించింది. లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలకు అప్పగించటం వల్ల దళితబంధు పథకం పక్కదారి పడుతుందని, ఈ పథకం రాజకీయ రంగు పులుముకొంటుందని, ముందు టీఆర్ఎస్ అనుకూల కుటుంబాలకే వర్తింపజేస్తారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిస్థితి ఏమిటని? ఇలా అనేకానేకా భయాలను ‘రాజకీయబంధు’ పేరుతో శుక్రవారం ప్రచురించిన కథనం ద్వారా సృష్టించేందుకు తన శాయశక్తులా ప్రయత్నించింది.
ఇదే మొదలా?
దేశంలోని అనేక రాష్ర్టాలు.. ఆ మాటకొస్తే ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ హయాంలలో అనేక పథకాలు అమలయ్యాయి. ఆయా పథకాల లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలే చేశారు. చంద్రబాబు హయాంలో చేపట్టిన జన్మభూమి పథకం వివిధ దశలుగా అమలైంది. ప్రాధాన్య క్రమాలను బట్టి జన్మభూమిలో గ్రామాలను ఎంపిక చేసేవారు. ఒక నియోజకవర్గంలో ఆరేడు మండలాలు,ఆ మండలానికి చెందిన గ్రామాల్లో కార్యక్రమాలు జన్మభూమి, పచ్చదనం పరిశుభ్రత కింద పనులు చేపట్టాలంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొనేవారు. ప్రభుత్వం ఇచ్చే రూ.75 పింఛన్ లబ్ధిదారుల ఎంపిక కూడా సంబంధిత ఎమ్మెల్యేనే చేసేది. విద్యార్థులకు సైకిళ్లు, ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ చేసినా ఆ లబ్ధిదారులను ఎంపిక చేసినదీ ఎమ్మెల్యేలే. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, డ్వాక్రా సంఘాలకు నిధులు మంజూరు చేయాలన్నా, రైతుబజార్ల నిర్మాణం ఎంపిక అయినా, ఈ-సేవా కేంద్రాలు తెరవాలన్నా లబ్ధిదారులు లేదా లబ్ధిపొందే గ్రామాల ఎంపిక అన్నీ ఎమ్మెల్యేల నేతృత్వంలోనే సాగేవి. చివరికి ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా సదరు లబ్ధిదారులను కూడా ఎమ్మెల్యేలే ఎంపిక చేసిన పరిస్థితులు గతంలో కుప్పలుగా ఉన్నాయి. కాంగ్రెస్ హయాం కూడా ఇందుకు అతీతమైంది ఏమీ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన అనేక కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల పర్యవేక్షణ ఉండేది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమం కింద చేపట్టాల్సిన గ్రామాల ఎంపిక, అక్కడ చేపట్టే కార్యక్రమాలు ఎమ్మెల్యేలే నిర్ణయించేవారు. వైఎస్ హయాంలో పంపిణీ చేసిన పింఛన్ లబ్ధిదారులను ఎమ్మెల్యేలే ఎంపిక చేసేవారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కూడా ఎమ్మెల్యేలకే ప్రభుత్వం అప్పగించింది. నాటి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అమలయ్యే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఎంపికలో ప్రజాప్రతినిధులదే కీలక పాత్ర. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలయ్యే పథకాలకు లబ్ధిదారులను ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు) ఎంపిక చేయటం ఆనవాయితీ. ఎమ్మెల్యేలు ఎక్కువగా ప్రజాక్షేత్రంలో ఉంటారు. ఎప్పకప్పుడు పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంటారు. తాము ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల ప్రజల స్థితిగతులు, వారి కుటుంబ నేపథ్యాలపై స్థానిక ఎమ్మెల్యేలకు అవగాహన ఉంటుంది. నిత్యం ప్రజల్లో ఉంటారు కనుక తక్షణ అవసరం ఎవరికి ఉన్నదనే అంశాన్ని గుర్తించగలుగుతారు. అందుకే ఆయా ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సదరు నియోజకవర్గాల ఎమ్మెల్యేకు అప్పగించడం సంప్రదాయంగా వస్తూ ఉన్నది.
అదే ఆనవాయితీగా..
దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వమైనా ఎమ్మెల్యేలే లబ్ధిదారులను ఎంపిక చేయవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికను మాత్రం ఎమ్మెల్యేలు చేస్తే రాజకీయబంధు అవుతుందనేది ఆంధ్రజ్యోతి అక్కసుతో రాసిన కథనం. తనకు నచ్చిన వాళ్లు ఏం చేసినా తనకు ఇష్టముంటుంది. కానీ నచ్చనివారు ఏ పనిచేసినా అందులో రాజకీయం ఉం టుందని గుండెలు బాదుకోవడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నైజమని పలువురు తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. నిజానికి దళితబంధు పథకంలో లబ్ధిదారులకు నేరుగా రూ.10 లక్షలు చేతికి ఇవ్వటానికి వీలులేదు. ఈ పథకం కింద లబ్ధిదారుడి కుటుంబానికి ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి, ఆ ఖాతాలో డబ్బులు వేసి, లబ్ధిదారుడు ఎంపిక చేసుకొన్న యూనిట్‌కు చేరేలా ఏర్పాటు చేశారు. ఇందులో అవినీతికి ఎక్కడ తావు ఉంటుంది? లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇచ్చినంత మాత్రాన ఈ పథకం మార్గదర్శకాలు తలకిందులైపోతాయా? ఇవేవీ రాధాకృష్ణకు, ఆయన నడిపే పత్రికకు తెలియక కాదు! ప్రభుత్వం చేసే ప్రతి పనికి ఒక వంక పెట్టాలి. పథకం అమలు వేగం పుంజుకొంటున్న వేళ.. కాళ్లల్లో కట్టెలు పెట్టాలి. ప్రభుత్వ సంకల్పంపై బురద జల్లాలి. ప్రభుత్వ కృషిని కించపర్చాలి. ఇదే లక్ష్యంతో ఆంధ్రజ్యోతి కథనం ఉన్నదని పలువురు తెలంగాణవాదులు మండిపడుతున్నారు. దళితుల జీవితాలను మార్చే పథకంపై రాధాకృష్ణకు ఎందుకు దుగ్ధ అని నిలదీస్తున్నారు.