హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విజయ డెయిరీ వ్యాపారానికి ఆంధ్రా విజయ డెయిరీ గండికొట్టే కుట్ర చేస్తున్నది. హైదరాబాద్‌లో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే నెయ్యి విక్రయాలతో తిష్ట వేసిన ఏపీ విజయ డెయిరీ ఇప్పుడు పాలరంగంలోకి దిగుతున్నది. ఇందు లో భాగంగా హైదరాబాద్‌లో మిల్క్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 13న నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణలో పాలు కొనుగోలు చేయకుండా దళారులను మధ్యలో పెట్టి ‘విజయ’ బ్రాండ్ పేరుతో పాల విక్రయం జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
ఏపీ విజయ డెయిరీ ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఏపీ విజయ డెయిరీకి తెలంగాణలో ఎక్కడా మిల్క్ ప్లాంట్ లేదు. రాష్ట్ర రైతుల నుంచి ఒక్క చుక్క పాలు కూడా సేకరించడం లేదు. చివరికి ఏపీలో కూడా నేరుగా రైతుల నుంచి పాలు కొనుగోలు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో ప్రాసెసింగ్ చేసి, ప్యాకింగ్ చేసి విక్రయిస్తుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, హైదరాబాద్ మార్కెట్‌పై కన్నేసిన కొందరు బడాబాబులు, దళారులు చక్రం తిప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారు ఏపీ ప్రభుత్వంలోని కొందరి సహాయం తో విజయ డెయిరీని హైదరాబాద్‌లో కార్యకలాపాలకు ఒప్పించినట్టు తెలిసింది. ఈ టెండ ర్ దక్కించుకొని కర్ణాటకతోపాటు ఇతర రాష్ర్టా ల నుంచి తక్కువ ధరకే పాలు కొనుగోలు చేసి తీసుకొచ్చి, ఇక్కడ విజయ బ్రాండ్ పేరుతో విక్రయించాలని స్కెచ్ వేసినట్టు సమాచారం.
హైదరాబాద్‌లో ఏపీ విజయ డెయిరీ పాల విక్రయాలు ప్రారంభిస్తే తెలంగాణ రైతులకు, తెలంగాణ విజయ సంస్థకు తీవ్ర నష్టం ఖాయమని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, దుకాణదారులు ఏపీ పాలను విక్రయించేందుకు మొగ్గు చూపుతారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో తెలంగాణ విజయ పాల విక్రయాలు తగ్గిపోతాయి. తెలంగాణ విజయకు హైదరాబాద్ పెద్ద మార్కెట్. ఇది చేజారితే డెయిరీ మూత పడటం ఖాయమని, పాడి రైతులు రోడ్డున పడటం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ విజయ డెయిరీ యథేచ్ఛగా తెలంగాణలో వ్యాపారం మొదలుపెడుతూ తెలంగాణ విజయ డెయిరీ ఉనికిని ప్రశ్నార్థకం చేసే కుట్రలు చేస్తుంటే పశుసంవర్ధక శాఖ మంత్రి, రాష్ట్ర అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో పాల ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు 13న టెండర్లు ఆహ్వానించగా, ఇప్పటివరకు ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూనో, వ్యతిరేకిస్తూనో ప్రకటన చేయలేదు. ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ఏపీ విజయ డెయిరీకి లేఖ కూడా రాయలేదు. దీనిపై విజయ డెయిరీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా.. టెండర్ పిలిచిన అంశం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.