హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా ఆంధ్రా నేతల విగ్రహాలు పుట్టగొడుగుల్లా వెలుస్తుండటంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కాలరాసేలా తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను, ఉద్యమ సిద్ధాంతకర్తలను పకనబెట్టి, తెలంగాణేతర వ్యక్తుల విగ్రహాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, అస్తిత్వ ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం కోసం సచివాలయం ఎదురుగా కేటాయించిన స్థలంలో.. రేవంత్‌రెడ్డి సరార్ రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది.
తెలంగాణకు గుండెకాయ వంటి సచివాలయం ఎదుట తెలంగాణ తల్లికి ఇవ్వాల్సిన గౌరవాన్ని దకకుండా చేసి, దానికి రాజకీయ రంగు పులిమారనే విమర్శలు నేటికీ బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సంస్కృతి, కళలకు నిలయమైన రవీంద్రభారతి ప్రాంగణంలోకి కూడా ఆంధ్రా ముద్రను తీసుకొచ్చారు. ఏపీకి చెందిన సినీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్రభారతిలో ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణలో ఎంతోమంది గొప్ప కళాకారులు, గాయకులు, కవులు ఉండగా.. వారిని కాదని పక రాష్ట్రానికి చెందిన వ్యక్తుల విగ్రహాలను ఇకడ ప్రతిష్ఠించడం వెనుక కాంగ్రెస్ మార్ తెలంగాణ వ్యతిరేక ఆలోచన ఉన్నదంటూ తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు.
హైదరాబాద్‌లోని కీలక ప్రాంతమైన మైత్రీవనం సమీపంలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిషరించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మహానాడు వేడుకలు జరుపుకొంటున్న తరుణంలోనే.. తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించేందుకు రేవంత్‌రెడ్డి సరార్ ఉత్సాహం చూపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. నాడు తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న, తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన టీడీపీ.
. మళ్లీ తెలంగాణ గడ్డపై పాగా వేసేందుకు రేవంత్‌రెడ్డి తెరవెనుక సాయం చేస్తున్నారని, అందుకే ఈ విగ్రహాల రాజకీయం నడుస్తున్నదని మండిపడుతున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్‌లోనూ, వీధుల్లోనూ అవహేళన చేసిన శక్తులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అస్సలు జీర్ణించుకోలేని శక్తులు ఇప్పుడు కాంగ్రెస్ అండతో మళ్లీ హైదరాబాద్‌పై కన్నేశాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విగ్రహాల ఏర్పాటు అనేది ఒక నెపం మాత్రమేనని, దీని వెనుక తెలంగాణ సంపదను, ఇకడి భూములను మళ్లీ దోచుకునేందుకు ఆంధ్రా పెట్టుబడిదారులు సిద్ధమవుతున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ సిద్ధాంతమే శ్వాసగా, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షే ధ్యాసగా చివరి శ్వాస వరకు బతికిన ఆచార్య జయశంకర్‌సార్‌ను పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ సరార్.. తెలంగాణతో ఎలాంటి సంబంధం లేని, ఆంధ్రా ప్రాంత వ్యక్తుల విగ్రహాల ఏర్పాటును మాత్రం విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నదని నిప్పులు చెరుగుతున్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి, ఇకడి సంపదపై పడగవిప్పాలని చూస్తున్న పరాయిశక్తులకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పడం ఖాయమని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.