హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ): పోలవరం-బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) దూకుడు పెంచింది. గోదావరి బేసిన్ రాష్ర్టాలు, కేంద్ర సంస్థలు అనేక అభ్యంతరాలు లేవనెత్తుతున్నా కేంద్రం దన్నుతో వాటిని బేఖాతరు చేస్తూ తాజాగా డీపీఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానించింది. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా గోదావరి నుంచి 200 టీఎంసీల వరద జలాలను బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు రూ. 81వేల అంచనా వ్యయంతో ఏపీ సర్కారు పీబీ లింక్ ప్రాజెక్టుకు తెరతీసింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీ కోసం సిద్ధమైన ప్రభుత్వం అందుకు సంబంధించి కన్సల్టెన్సీల ఎంపిక కోసం రూ.9.2 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ను ఆహ్వానించింది. 22వ తేదీ ఉదయం 11 గంటల్లోగా టెండర్ డాక్యుమెంట్లు సమర్పించాలని వెల్లడించింది. పీబీ లింక్ ప్రాజెక్టుకు నిధులను సమకూర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం, అందుకు ఢిల్లీ పెద్దలు సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఏపీ సర్కారు ఇప్పటికే ప్రీ ఫిజుబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను సమర్పించింది. దానిపై బేసిన్‌లోని తెలంగాణ సహా అన్ని రాష్ర్టాలు వ్యతిరేకించాయి.
కేంద్రానికి తెలంగాణ సర్కారు ఫిర్యాదు
ఏపీ టెండర్‌కు సిద్ధపడడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇదే విషయమై కేంద్రానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి లేఖలు రా యాలని నిర్ణయించింది. అందు లో భాగంగా ఏపీ సర్కారు చేపట్టిన టెండర్ల ప్రక్రియను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీపీఏ, సీడబ్ల్యూసీకి వేర్వేరుగా ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీ జనరల్ లేఖ రాశారు.