అసెంబ్లీ సెషన్ పెట్టాలి
రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రధానితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలి. ఏపీ జలదోపిడీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచర్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ఏపీఅక్రమ నీళ్ల తరలింపుపై సుప్రీంకోర్టుకువెళ్లి న్యాయ పోరాటం చేయాలి.
నీటి హక్కులు కాపాడాలి
రేవంత్‌రెడ్డీ.. కాళేశ్వరంపై బురద చల్లడం మానేసి ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకో. తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాస్తుంటే మౌనంగా ఉంటూ చరిత్ర హీనుడిగా మిగిలిపోకు. కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలూ.. మొద్దునిద్ర వీడండి. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి.
– హరీశ్
హైదరాబాద్, జూన్14 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాలను చెరబట్టేందుకు ఏపీ ప్రభుత్వం గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టు పనులను ముమ్మరంగా ముందుకు తీసుకుపోతున్నదని, నెలాఖరున టెండర్లను పిలిచేందుకు కూడా సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. అనుమతులు లేకుండా, నిబంధనలన్నీ తుంగలో తొక్కి చేపడుతున్న ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వమే నిధుల సాయం చేసేందుకు సిద్ధమైందని ధ్వజమెత్తారు. రాష్ట్ర జలహక్కులను ఏపీ, కేంద్రం కాలరాస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ సర్కారు నోరువిప్పడం లేదని మండిపడ్డారు. బాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్‌రెడ్డి మౌనం వహిస్తున్నారని నిప్పులు చెరిగారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఇకనైనా కండ్లు తెరచి బనకచర్లను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ విషయమై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని, లేదంటే రైతుల కోసం.. తెలంగాణ జలహక్కుల రక్షణ కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. ‘గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడీ- కాంగ్రెస్ మౌనం’ అనే అంశంపై తెలంగాణ భవన్లో హరీశ్ శనివారం ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు వాటిల్లబోయే నష్టాన్ని పూర్తిగా వివరించారు. అక్రమ ప్రాజెక్టుకు కాంగ్రెస్, బీజేపీ ఎలా సహకరిస్తున్నాయో చెప్తూనే నిప్పులు చెరిగారు.
పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిందని, అయినా సీఎం రేవంత్, సాగునీటి మంత్రి ఉత్తమ్ మౌనంగా ఉంటున్నారని హరీశ్ నిప్పులు చెరిగారు. సీఎం, మంత్రులకు కేటీఆర్ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ.. తెలంగాణ జలహక్కుల పరిరక్షణపై లేదని విమర్శించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతున్నా.. టెండర్లను పిలిచేందుకు సిద్ధమవుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. తాతాలిక ఒప్పందానికి మించి ఏపీ కృష్ణా జలాలను తీసుకుపోయినా ఎందుకు మాట్లాడరని, గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం తలపెడితే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉండీ బనకచర్లపై నోరు మెదపడం లేదని నిప్పులు చెరిగారు.
రెండు టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టుపై ఆనాడు మహారాష్ట్రతో చంద్రబాబు పోరాటం చేశారని, మరి నేడు 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎంత పోరాటం చెయ్యాలని హరీశ్ ప్రశ్నించారు. మరి రేవంత్‌రెడ్డి ఎందుకు ఒక మాట కూడా మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రాకు ఇచ్చామని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలోనే చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికైనా కండ్లు తెరవాలని, నష్టం జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలన్నారు.
పదవులు, రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నరు. వాళ్లకు ప్రతిపక్షాలపై ఇరిటేషన్ తప్ప ఇరిగేషన్ మీద దృష్టి లేకుండా పోయింది. గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం జరుగుతున్నా ఎందుకు స్పందించరు? నిధులు, నదులు రెండూ ఆంధ్రాకే అన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఉన్నది. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉండీ నోరు మెదపడం లేదు.
– హరీశ్‌రావు
‘కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలు చెరబట్టేందుకు ఏపీ కుతంత్రాలకు తెరలేపింది.. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంలో మొత్తం 200 టీఎంసీల తరలింపునకు రూ.80,112 కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ చర్యలు వేగవంతం చేసింది. 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయాన్ని నిర్మించనున్నది. కృష్ణా, పెన్న బేసిన్ ప్రాంతాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం గోదావరి జలాలను మళ్లించనున్నది’ అని హరీశ్ వివరించారు.
పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్న ఏపీ, ఇప్పుడు గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు బనకచర్ల ప్రాజెక్టును చేపట్టింది. మన రాష్ట్ర జల హక్కులను అటు ఏపీ, ఇటు కేంద్రం కాలరాస్తున్నా సీఎం రేవంత్, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరు మెదుపుతలేరు. వారికి కేటీఆర్ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ తెలంగాణ జలహక్కులను పరిరక్షించడంపై లేదు.
తెలంగాణ జలహక్కుల కోసం రాష్టర ప్రభుత్వం చేసే ఏ రకమైన పోరాటంలోనైనా బీఆర్ఎస్ కలిసి వస్తుందని, అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే సహకరిస్తామని హరీశ్ స్పష్టంచేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా పోరాటానికి, న్యాయపోరాటానికి బీఆర్ఎస్ శ్రీకారం చుడుతుందని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్టు హరీశ్ తెలిపారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతోపాటు రిజర్వాయర్లను ప్రజలతో కలిసి సందర్శిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల జీవధార అని స్పష్టంచేశారు. మేడిగడ్డ బరాజ్‌లో 86 పిల్లర్లలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలినట్టుగా కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్న ఏపీ, ఇప్పుడు గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు బనకచర్ల ప్రాజెక్టును చేపట్టింది. మన రాష్ట్ర జల హక్కులను అటు ఏపీ, ఇటు కేంద్రం కాలరాస్తున్నా సీఎం రేవంత్, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరు మెదుపుతలేరు. వారికి కేటీఆర్ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ తెలంగాణ జలహక్కులను పరిరక్షించడంపై లేదు.
– హరీశ్‌రావు
గోదావరిపై ఏపీ సర్కారు చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హరీశ్ ధ్వజమెత్తారు. రాష్ట్రవాటాను సైతం ఏపీ కొల్లగొడుతున్నదని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోని పక్షంలో తాము గోదావరి పరీవాహక ప్రాంతల రైతుల తరఫున సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. రేవంత్ మౌనం ఏపీకి వరంగా మారిందని, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉత్త మాటల రెడ్డిగా మారారని ధ్వజమెత్తారు. గురుదక్షిణ కింద బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్‌రెడ్డి మౌనంగా ఉంటూ పరోక్షంగా సహకరిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కారు చేసిన అప్పులపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని హరీశ్ చెప్పారు. ఒక్క పెద్ద పథకం, ప్రాజెక్టు చేపట్టకుండానే 18 నెలల్లో రికార్డుస్థాయిలో అప్పులు చేసిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సర్కారు అప్పులపై కూడా త్వరలో తెలంగాణ భవన్‌లోనే ప్రజలకు పీపీటీ ద్వారా వివరిస్తామని వెల్లడించారు.
రెండు టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం అనాడు మహారాష్ట్రపై చంద్రబాబు పెద్ద పోరాటం చేసిండ్రు. మరి నేడు 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎంత పోరాటం చెయ్యాలె? కానీ రేవంత్‌రెడ్డి ఎందుకు ఒక మాట కూడా మాట్లాడుతలేరు? దోస్తానా కోసం, గురుదక్షిణ కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతారా రేవంత్?
– హరీశ్‌రావు
‘గోదావరి, కృష్ణా బోర్డుల అనుమతి లేదు. అపెక్స్ కౌన్సిల్లో చర్చ లేదు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఇవేవీ లేకుండా నేరుగా ప్రాజెక్టు పనులకు టెండర్ పిలిచేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతున్నది. నియంత్రించాల్సిన కేంద్రం నిధులు సమకూర్చుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నది. సెక్షన్ 3 ప్రకారం గోదావరి ట్రిబ్యునల్ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఇదివరకే అర్జీ పెట్టుకున్నది. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో జలదోపిడీకి చంద్రబాబు చేసిన కుట్ర ఇది. గతంలో కృష్ణా జలాల్లో ఇదే విధంగా వ్యవహరించారు. రైపేరియన్ రైట్ క్లెయిమ్ చేశారు. దానినే ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నరు. బనకచర్ల ప్రాజెక్టు పనులను ముందుగానే ప్రారంభించి, నిధులు ఖర్చు చేసి, 200 టీఎంసీల నీటిని కేటాయించాలని గోదావరి ట్రిబ్యునల్ ముందు వాదించాలనేది ఏపీ ప్లాన్. గోదావరి బేసిన్లో ఉమ్మడి ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీల నీటి వాటాను ఇప్పటికీ ఏపీ వ్యతిరేకిస్తున్నది’ అని హరీశ్ వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. బాబు, రేవంత్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడింది. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న ప్రభుత్వమా? గోదావరి, కృష్ణాల్లో ఏపీ జలదోపిడీ గురించి బీఆర్ఎస్ హెచ్చరించినా అడ్డుకునే ప్రయత్నం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
– హరీశ్‌రావు
‘1975లో గోదావరి నీళ్లపై ట్రిబ్యునల్ కీలక విషయం చెప్పింది. కృష్ణా అవార్డ్‌లో ఉన్నట్టు గోదావరి అవార్డ్‌లో నికర జలాలు, వరద జలాలు అనే కాన్సెప్ట్ లేదు. వరద జలాలు అనే విభజన లేనప్పుడు ఏపీ ఎలా మళ్లించుకుంటది? గోదావరి నీళ్లను కృష్ణా ఆయకట్టుకు వాడుకుంటే బేసిన్ రాష్ర్టాలకు ఆ మేరకు వాటా ఇవ్వాలి. ట్రిబ్యునల్ అవార్డ్ ఫైనల్.. సుప్రీంకోర్టు కూడా అడ్డుకోలేదు. కాబట్టి పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించే నీటికి బదులుగా కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా పొందే హక్కు ఉన్నది. గోదావరి అవార్డు ప్రకారం..
80 టీఎంసీలకు మించి గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌కు తరలించినట్టయితే, అందుకు గాను 45:21:14 నిష్పత్తిలో కృష్ణా జలాల్లో వాటాను ఎగువ రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు అదనంగా 112.5 టీఎంసీల వాటా ఇవ్వాలి. పోలవరం ద్వారా తరలించే గోదావరి నీటికి బదులు తెలంగాణకు కృష్ణా జలాల్లో గోదావరి అవార్డు ప్రకారం రావాల్సిన వాటా 45+112.5=157.5 టీఎంసీలు. ఆ జలాలు వస్తే పాలమూరు రంగారెడ్డితోపాటు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నింటికీ నికర జలాలను కేటాయించుకోవచ్చు. దాన్ని డిమాండ్ చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి మౌనంగా ఉన్నారు. వాటా ఎందుకు అడగడం లేదు” అని హరీశ్‌రావు నిలదీశారు.
‘పేరుకే 200 టీఎంసీల నీటిని మళ్లిస్తామని ఏపీ చెప్తున్నా భవిష్యత్తులో దాన్ని 400 టీఎంసీలకు పెంచుకుంటామని కేంద్రానికి సమర్పించిన నివేదికలోనే ఏపీ సర్కారు స్పష్టంచేసిందని హరీశ్ వెల్లడించారు.
‘నదుల అనుసంధాన ప్రాజెక్టులను చేపట్టే ముందు ఆ నది బేసిన్లో ఉండే రాష్ర్టాల అనుమతి కోసం కన్సల్టెన్సీ మీటింగ్‌ను కేంద్ర జలవనరులశాఖ నిర్వహించింది. జూన్ 12న హైదరాబాద్ జలసౌధలో జరగాల్సిన గోదావరి-కావేరి కన్సల్టెన్సీ మీటింగ్‌ను రద్దుచేసి అదే రోజు గోదావరి-బనకచర్ల-కావేరి లింక్ ప్రాజెక్టు టాస్క్‌ఫోర్స్ మీటింగ్ ఢిల్లీలో నిర్వహించారు. గోదావరి-కావేరి కన్సల్టెన్సీ మీటింగ్‌ను రద్దుచేసి, హడావుడిగా టాస్క్‌పోర్స్ మీటింగ్ నిర్వహించింది గోదావరి బనకచర్ల లింక్ కోసమేనా? గతంలో బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తే సమ్మక్కసాగర్ వద్ద గోదావరి-కావేరి లింక్ నిర్మాణాన్ని నిలిపివేసిన కేంద్రం.. గోదావరి-బనకచర్ల లింక్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా సూత్రప్రాయంగా అంగీకరించడమంటే తెలంగాణకు తీరని అన్యాయం చేయడమే. సమ్మక్క సాగర్ నుంచి గోదావరి-కావేరి అనుసంధానం చేపడితే తెలంగాణ భూభాగానికి 75 టీఎంసీల వాటా దక్కుతుంది. ఈ కుట్ర వల్ల తెలంగాణ 75 టీఎంసీల నీటిని నష్టపోతుంది’ అని హరీశ్ వివరించారు.
ఏపీ జలదోపిడీకి కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్నివిధాలా సహకరిస్తున్నదని హరీశ్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాజెక్టులకు మూట సాయం కాదుకదా. కనీసం మాట సాయం కూడా లేదని, కానీ నిధులు, నదులు అన్నీ ఆంధ్రాకే అన్నచందంగా వ్యవహరిస్తున్నదని నిప్పులు చెరిగారు. బనకచర్లను అడ్డుకోవాలని బీఆర్ఎస్ లేఖ రాసినా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికీ స్పందించలేదని వివరించారు. తెలంగాణ కన్నా పదింతల ఎక్కువ నిధులు ఏపీకి ఇచ్చామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా ఆంధ్రాలోనే ప్రకటించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ‘పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నది.
బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు, ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి 50 శాతం రుణ సమీకరణకు అనుమతిస్తామని ఏపీకి హామీ ఇచ్చింది. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉండీ ఏం లాభం? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పీఎఫ్సీ నుంచి తెలంగాణ ప్రభుత్వం రుణం తీసుకుంటే ఎఫ్ఆర్బీఎం కింద రికవరీ పెట్టారు. కానీ బనకచర్ల విషయంలో అందుకు భిన్నంగా 50 శాతం నిధులిస్తూ ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రుణ సమీకరణకు ఏపీకి సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది. ఏపీపై వరాల జల్లులు కురిపిస్తూ, తెలంగాణపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు’ అని హరీశ్ మండిపడ్డారు.
ఏపీ జలదోపిడీకి కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్నివిధాలా సహకరిస్తున్నది. తెలంగాణ ప్రాజెక్టులకు మూట సాయం కాదు కదా! కనీసం మాట సాయం కూడా చేస్తలేదు. కానీ, నిధులు, నదులు అన్నీ ఆంధ్రాకే అన్నచందంగా వ్యవహరిస్తున్నది. బనకచర్లను అడ్డుకోవాలని బీఆర్ఎస్ లేఖ రాసినా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికీ స్పందించలేదు. అదీగాక తెలంగాణ కన్నా పదింతల నిధులు ఏపీకి ఇచ్చామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో ప్రకటించడం సిగ్గుచేటు.
– హరీశ్‌రావు
ఏపీ కృష్ణా జలాల దోపిడీకి పాల్పడుతున్నా కాంగ్రెస్ స్పందించడం లేదని హరీశ్ ధ్వజమెత్తారు. ‘తాత్కాలిక ఒప్పందం 66:34 ప్రకారం 2024-25 నీటి సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వాటా వినియోగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఏపీ 72.2 శాతం (715.03 టీఎంసీలు) వాడుకోగా, తెలంగాణ వాడుకున్నది కేవలం 27.8 శాతం. ఇది తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యల్ప వినియోగం. ఇందుకు పూర్తిగా కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం. ఆరున్నర లక్షల ఎకరాల్లో సాగుకు సరిపోయే 65 టీఎంసీలను తెలంగాణ కోల్పోయింది. 2014 నుంచి 2023 వరకు తాత్కాలిక వాటా ప్రకారం 34 శాతం వాటాను దాదాపుగా బీఆర్ఎస్ వినియోగించింది.
66:34 తాత్కాలిక వాటాకు మేము ఒప్పుకున్నామని నిందలు మోపే కాంగ్రెస్ పాలకులు, ఇప్పుడు అదే తాత్కాలిక వాటాను కొనసాగించి కనీసం దాన్ని కూడా వినియోగించుకోలేక చేతగానితనం చూపుతున్నరు. ఇప్పటికే పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటరీ కెపాసిటీని 90 వేల క్యూసెక్కులకు పెంచుకున్న ఏపీ, దాని కింద నిర్మించిన శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ఆర్ఎంసీ) ద్వారా పూర్తిస్థాయిలో నీటిని తరలించే కుట్రను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు లైనింగ్ లేని ఈ కెనాల్ ద్వారా కేవలం 44 వేల క్యూసెక్కులే తరలించే వీలుండగా, సీసీ లైనింగ్ పనులు పూర్తి చేయడం ద్వారా రోజూ 90 వేల క్యూసెక్కులు (8 టీఎంసీలు) తరలించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది’ అని నిప్పులు చెరిగారు.
నష్టం జరగకముందే ఏపీ బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలె. తెలంగాణ జలహక్కుల కోసం ప్రభుత్వం చేసే ఏ రకమైన పోరాటంలోనైనా బీఆర్ఎస్ కలిసి వస్తది. అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే సహకరిస్తం. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజాపోరాటానికి, న్యాయపోరాటానికి బీఆర్ఎస్ శ్రీకారం చుడుతది. ఇకనైనా రేవంత్ చిల్లర రాజకీయాలు బంద్ చెయ్యాలె. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మౌనం వీడాలె. లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతరు.
– హరీశ్‌రావు
‘బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతున్నదని బీఆర్ఎస్ నిలదీసిన తర్వాత గాని మంత్రి ఉత్తమ్ మేల్కొనలేదు. బ్యాక్ డేట్‌తో 22.1.2025 తేదీతో కేంద్రానికి లేఖరాసి, బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం నివేదికలు సమర్పించిందా అని లేఖలో అడిగారు. నాలుగు నెలల తర్వాత మే 28న స్వయంగా జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమాధానమిచ్చారు. ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నివేదికలను ఇవ్వలేదని తెలిపారు. కానీ సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్ సౌత్ డైరెక్టర్ రాసిన లేఖలో ఏపీ ప్రభుత్వం మే 23న ప్రీ ఫిజిబులిటీ రిపోర్టు సమర్పించిందని స్పష్టంచేశారు. కేంద్రం ఇంతగా అబద్ధాలాడినా, పక్క రాష్ట్రం దోపిడీ చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాట కూడా మాట్లాడదు. ఏపీ కుట్రలను నిలువరించదు’ అని మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. ‘బాబు, రేవంత్, బీజేపీ మధ్యలో లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడింది. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? బాబు డైరెక్షన్లో నడుస్తున్న ప్రభుత్వమా? గోదావరి, కృష్ణాల్లో ఏపీ ప్రభుత్వ జలదోపిడీ గురించి బీఆర్ఎస్ హెచ్చరించినా దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నీతి అయోగ్ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ఇతర మంత్రులకు తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు కనిపించడం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు దూకుడును ఎందుకు అడ్డుకోలేకపోతున్నది? ఎందుకు చోద్యం చూస్తున్నది?’ అని హరీశ్ నిలదీశారు.
గోదావరి వరద జలాలనే వాడుకుంటం. తెలంగాణ ప్రాజెక్టులకు నేనూ ఎన్నడూ అడ్డుచెప్పలే. ఇతర రాష్ర్టాలు బనకచర్ల ప్రాజెక్టుకు అడ్డు చెప్పడం లేదు అని చంద్రబాబు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు. కాళేశ్వరం అనుమతులన్నీ రద్దుచేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్రానికి బాబు లేఖ రాసిండ్రు. ఒక్క గోదావరి పైనే కాదు.. కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకూ అనేక లేఖలు రాసిండ్రు. గోదావరిలో జలాలు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలె.
– హరీశ్‌రావు
‘గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నం. తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో నేను ఎన్నడూ అడ్డుచెప్పలేదు. ఇతర రాష్ర్టాలు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదని చంద్రబాబు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలని హరీశ్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకున్నారని నిప్పులు చెరిగారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దుచేయాలని, పనులను తక్షణం నిలిపివేయాలని కేంద్రానికి లేఖ రాశారని, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ కాళేశ్వరాన్ని కడుతున్నారంటూ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని చంద్రబాబు కుటిలయత్నం చేశారని హరీశ్ గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటిని అందించే భక్త రామదాసు ప్రాజెక్టును అడ్డుకునేందుకుందు 2017లో కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖరాసిందని, గోదావరి పైనే కాకుండా కృష్ణా బేసిన్లోనూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అనేక లేఖలు రాసిందని చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, సుంకిశాల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జలవనరుల శాఖ, కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీకి ఏపీ సర్కారు అనేక లేఖలు రాసిందని, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను అడ్డుకోవాలని 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి చంద్రబాబు స్వయంగా లేఖ రాశారని మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు, తాగునీరు అందించే తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు నాటి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని, కల్వకుర్తికి కేటాయించిన 25 టీఎంసీలు సరిపోవని గత బీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ మరో 15 టీఎంసీలు కేటాయిస్తే దానిపైనా కేంద్రానికి ఫిర్యాదు చేశారని నిప్పులు చెరిగారు. గోదావరిలో జలాలుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.