హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రజ్యోతి దినపత్రిక మరోసారి కనీస విలువలు మరిచిపోయింది. తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై మళ్లీ కుట్రలకు తెరలేపింది. సీఎం కేసీఆర్ అనని మాటలను ఆపాదించి అడ్డదిడ్డంగా ఓ కథనాన్ని ప్రచురించింది. సున్నితమైన అంశమన్న జ్ఞానం కూడా లేకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలను జతచేసింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏసుక్రీస్తు గొప్పతనం గురించి, మత సామరస్యం గురించి సీఎం మాట్లాడారు. దీనిని ప్రపంచమంతా చూసింది.
ఆంధ్రజ్యోతి కండ్లకు మాత్రం అది కనబడలేదు. చెవులు వినబడలేదు. ‘తప్పులు జరిగేది మతోన్మాదంతోనే..!’ అనే శీర్షికతో గురువారం తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ‘కొంత మంది పిచ్చి ముస్లిం రాజులు అప్పట్లో గుళ్లపై దాడులు చేశారు. దాంతో హిందూ సోదరులకు బాధ కలిగింది. కొంత మంది వేరే రాజులు, వేరే మతం వాళ్లవి కూలగొట్టారు. దానివల్ల సాధించిందేమున్నది? పరస్పర దాడులతో మానవ జాతికి జరిగిన మేలేమీ లేదు’ అని సీఎం కేసీఆర్ అన్నట్టుగా ఆ కథనంలో రాసుకొచ్చారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ మాటలను అసలు అనలేదు. హిందూ, ముస్లిం, గుడుల పేర్లే ఎత్తలేదు. రాజులు, కూల్చివేతల గురించి కనీసం ప్రస్తావించలేదు. అయినా ఆంధ్రజ్యోతి ‘అంధ’జ్యోతిగా.. ‘బధిర’జ్యోతిగా మారిపోయి సీఎం అనని మాటలను ఆపాదించి కథనాన్ని ప్రచురించింది.
తెలంగాణవాదుల మండిపాటు
ఆంధ్రజ్యోతి కథనంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి, నేడు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నదని ఆగ్రహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పేపర్ ద్వారా, టీవీలో విషం చిమ్ముతూనే ఉన్నదని మండిపడుతున్నారు. గతంలో అనేకసార్లు ఇలాంటి తప్పుడు కథనాలు వండి వార్చిందని, ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్ అనని మాటలను ఆపాదించిందని గుర్తుచేస్తున్నారు. ఎవరి మెప్పు కోసం ఈ తప్పుడు కథనం ప్రచురించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.