హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కిలోమీటర్ మాత్రమే కొనసాగాయనేది అవాస్తవమని, 11.48 కిలోమీటర్ల మేర పనులు జరిగాయని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. పనుల జాప్యానికి టన్నెల్ బోరింగ్ మిషన్ టెక్నాలజీ, టన్నెల్లో సీపేజీనే ప్రధాన కారణమని తెలిపారు. ఏప్రిల్ 18న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ 33 నెలల్లో పూర్తి’ శీర్షికతో వచ్చిన వార్తలో అవాస్తవాలను ప్రచురించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడేనాటికి పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులపై రివ్యూ చేసి, త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు. అందులో ఎస్ఎల్బీసీ కూడా ఉన్నదని, 2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదటి నుంచి నత్తనడకననే సాగిందని వివరించారు. ఇందుకు అనేక సాంకేతిక, భౌగోళిక పరిస్థితులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కారణమని మండిపడ్డారు.
‘43.93 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి 33 కిలోమీటర్ల టన్నెల్ తవ్వారని ఆ వార్తలో ప్రచురించారు. అది అవాస్తవం. 2014 జూన్ నాటికి 22.89 కిలోమీటర్ల వరకు మాత్రమే టన్నెల్ తవ్వారు. అందుకు రూ.1,248 కోట్లు ఖర్చు పెట్టారు. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా పనులు చేయించాం. ఉమ్మడి ఏపీలో పెండింగ్‌లో ఉన్న భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌తో పాటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించి మొదటి ఏడాది బడ్జెట్లోనే నిధులు కూడా కేటాయించాం’ అని తెలిపారు. అనేక ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నా అప్పటి ప్రభుత్వం టన్నెల్ బోరింగ్ మిషన్ అనే పాత పద్ధతి ద్వారా సొరంగం తవ్వాలని నిర్ణయించిందని, ఇదే పనుల జాప్యానికి కారణమని వివరించారు.
అదీగాక బోరింగ్ మిషన్ తరచూ రిపేర్లకు గురవటం, విదేశీ నిపుణులు వచ్చి రిపేర్ చేసేందుకు నెలల కొద్దీ సమయం పట్టడం కూడా జాప్యానికి కారణమని వెల్లడించారు. వర్షాకాలంలో శ్రీశైలంలో ఎకువ నీళ్లు వచ్చినప్పుడు ఈ టన్నెల్లోకి కూడా నీరు వస్తుందని, వీటిని బయటకు పంపి మళ్లీ పని ప్రారంభించడానికి సమయం పట్టేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 22.89 కిలోమీటర్ల నుంచి తవ్వకం ప్రారంభించి, 2023 డిసెంబర్ నాటికి 11.48 కిలోమీటర్ల మేర తవ్వినట్టు వివరించారు. అందుకు రూ.1,1117 కోట్లు ఖర్చు పెట్టామని, మొత్తంగా ఇప్పుడు టన్నెల్ 34.37 కిలోమీటర్ల మేర తవ్వకం పూర్తయిందని తెలిపారు. ఇంకా 7 కిలోమీటర్ల పని మాత్రమే మిగిలి ఉన్నదని వెల్లడించారు. ఏడాదికి రెండున్నర కిలోమీటర్లు మాత్రమే తవ్వటం సాధ్యమవుతుందని వివరించారు. సర్కారు మిగతా పనిని మూడేండ్లలో పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని హరీశ్ డిమాండ్ చేశారు.