హైదరాబాద్, జులై 17(నమస్తే తెలంగాణ): తెలంగాణపై ఆంధ్రా పత్రిక ఆంధ్రజ్యోతి పన్నాగం మరోసారి బయటపడింది. గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కప్పిపుచ్చి.. ఆంధ్రాకు మేలు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే బుధవారం ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ర్టాల సీఎంల భేటీ అంశంపై ద్వంద్వ రాతలు రాసుకొచ్చింది. ఆంధ్రాలో ఒక మాట చెప్పి, తెలంగాణలో మరో పాట పాడింది. ఈ సమావేశంలో నిర్ణయించిన కమిటీ ఏర్పాటు బాధ్యతలపై ఇక్కడ ఒకలా అక్కడ మరోలా వార్తలు రాసింది.
కమిటీకి సంబంధించి తెలంగాణ ఎడిషన్లో బనకచర్ల పదాన్ని గాయబ్ చేసిన ఆంధ్రజ్యోతి.. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో మాత్రం బనకచర్ల పదాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఇందులో భాగంగానే తెలంగాణ ఎడిషన్లో ‘జలవివాదాలపై కమిటీ’ అనే శీర్షిక పెట్టగా.. ఏపీలో మాత్రం ‘బనకచర్ల, కృష్ణా, గోదావరి సమస్యలపై నిపుణులతో కమిటీ’ అనే శీర్షిక పెట్టడం గమనార్హం. ఈ రెండు శీర్షికలను గమనిస్తే తెలంగాణలో బనకచర్ల గాయబ్ కాగా ఏపీలో మాత్రం బనకచర్ల పదాన్ని పొందుపరిచింది.