వరంగల్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అందె ఎల్లయ్య.. ఇంటికే పరిమితమైన పేరు. కానీ.. అందెశ్రీ లోకకవి అయ్యిండు. పసులగాసి ప్రకృతిని ఔపోసన పట్టిండు. బలపం పట్టి బడికిపోకపోయినా ‘జయజయహే తెలంగాణ’ అంటూ తెలంగాణ జాతి గీతమైండు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అంటూ వేదన చెంది మానవతను తట్టిలేపి మాయమైపోలేనివాడుగా నిలిచిపోయిండు. ‘కొమ్మచెక్కితే బొమ్మరా.. అది కొలిచి మొక్కితే అమ్మరా.. ఆదికే ఇది పాదురా.. లేదంటే ఏదీ లేదురా’ అంటూ మానవధర్మాన్ని విడమరచి చెప్పాడు.
ఆచార్య బిరుదురాజు రామరాజు నుంచి శంకర్ మహారాజ్ దాకా ఎంతోమంది తనకు మార్గదర్శకులని చాటారు. నిర్మాణ పనుల్లో తాపీ మేస్త్రీగా శ్రమించారు. చిన్నతనంలో ఎల్లయ్యగా తన చెక్కిళ్లపై కన్నీటి నది వెనుక ఉన్న ఆంతర్యం తెలియకపోయినా అందెశ్రీ అయ్యాక మంజీర, గోదావరి, నర్మద, సింధు, కావేరి, గంగా నదుల మీదుగా మిసిసిపీ.. నైలు, హోయాంగ్ హో సహా ప్రపంచంలోని దాదాపు అన్ని నదుల పుట్టుకను పసిగట్టినవాడు. తెలంగాణ ఉద్యమంలో ‘ధూం..ధాం’ చేసినవాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి(ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) అందెశ్రీకి జన్మనిచ్చింది. ‘నా ఊరే నా కన్నతల్లి’ అని ఆచరించాడు. లోకకవిగా పేరుతెచ్చుకున్నా మూలాన్ని ఎన్నడూ మరువలేదు. ‘సూడా చక్కానీ తల్లీ.. చుక్కలో జాబిల్లీ.. నవ్వుల్లో నాగామల్లీ.. నా పల్లే పాలవెల్లీ’ అంటూ రేబర్తిని తద్వారా తెలంగాణను ఆకాశమంత ఎత్తున నిలిపాడు. సుద్దాల హన్మంతు పాటలెక్క అందెశ్రీ ఆరేండ్లకే ‘పాలబుగ్గల జీతగాడు’. ప్రకృతిని తల్లి ఒడిగా పశు పక్ష్యాదులను తన సోపతిగాళ్లుగా భావించేవారు. ‘పొద్దున ఇంత గట్కతిని పసులను ఎంటేసుకొని పోతే పొద్దు గూకేదాకా అడవికి నేనే మారాజును’ అని తన బాల్యం గురించి చెప్పుకున్నారు. పసులకాడికి పోయి పొద్దుగూకినంక బర్రె తోక పట్టుకుని ఇల్లు చేరేవాడిననీ చెప్పుకున్న సందర్భాలున్నాయి.
పాలేరుగా జీవితాన్ని ప్రారంభిన అందెశ్రీ ప్రజాకవిగా, లోకగేయ కవిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చారిత్రక, సామాజిక చైతన్యాన్ని పుణికి పుచ్చుకొని కాకతమ్మకు పాటల పట్టాభిషేకం చేశారు. ‘గలగల గజ్జెల బండి గల్లుచూడు-ఓరుగల్లు చూడు, నాటి కాకతీయులేలినట్టీ ఖిల్లా చూడు.. నా జిల్లా చూడు’ అంటూ పల్లవించారు. ‘పల్లె నీకూ వందనాలమ్మా.. కొమ్మ చెక్కితె బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా, మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.., చూడా చక్కానీ తల్లీ.. చుక్కల్లో జాబిల్లీ, నవ్వుల్లో నాగామళ్లీ నా పల్లె పాలావెల్లీ’ అంటూ తెలంగాణ సబ్బండ కులాల జీవనాన్ని ఒక్కపాటతో ఇతిహాసంగా మలచారు.
కేసీఆర్ నాయకత్వంలో రాజకీయ ఉద్యమంగా రూపాంతరం చెందిన తెలంగాణకు ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ అంటూ ఆలపించి సాంస్కృతిక ఉద్యమభూమికను తద్వారా తెలంగాణ జాతిగీతాన్ని అందించారు. ఉమ్మడి పాలనలో అల్లాడుతున్న తెలంగాణ పాటకు ‘జై బోలో తెలంగాణ’.. అంటూ జయకేతనమై ఎగిరాడు.
అందెశ్రీకి స్వర్ణకంఠం నుంచి మొదలు లోకకవిగా గుర్తింపు దాకా పురస్కారాలు, అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. అందెశ్రీ వాక్కులమ్మ పేరుతో బృహత్సంకలనం తెచ్చారు.