వేములవాడ, డిసెంబర్ 26 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారిలో పురాతన రాతి విగ్రహం బయటపడింది. వేణుగోపాలస్వామి ఆలయానికి సమీపంలో రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు కు ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణా లు చేపడుతున్నారు. శుక్రవారం తవ్వకాలు జరుపుతుండగా పురాతన రాతి విగ్రహం బయటపడింది. విగ్రహానికి ఐదు వైపులా బుద్ధుడి తరహాలో నమూనాలు ఉన్నాయి. విగ్రహాన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. అధికారులు చేరుకొని బయటపడిన రాతి విగ్రహాన్ని పక్కనే ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి తరలించారు.
వేములవాడ, డిసెంబర్ 26: సమ్మక -సారలమ్మ జాతర నేపథ్యంలో వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అమాయక భక్తులను ఆసరాగా చేసుకొని కొందరు దళారులు దర్శనాలు కల్పిస్తామంటూ రూ. 300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవల హనుమకొండకు చెందిన భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ దందా నిర్వహిస్తున్న పలువురిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోవడం, పత్రికల్లో కథనాలు రావడంతో ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. ఆలయ ఈవో రమాదేవి వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏడుగురు దళారులపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.