వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నర్సంపేట: పేదల ఇండ్లపైనే కాదు, కాకతీయ కట్టడాలపై సైతం రేవంత్ సర్కార్ బుల్డోజర్ విరుచుకుపడుతున్నది. మారుమూల ప్రాంతాల్లోనూ బుల్డోజర్ విధ్వంసం మొదలైంది. చివరకు కాకతీయుల ఆనవాళ్లను సైతం వదిలిపెట్టడం లేదు. నేలమట్టమైన ఈ కాకతీయ చారిత్రక కట్టడమే అందుకు సాక్ష్యం. వందల ఏండ్లు, భీకర వరదలను తట్టుకొని సగర్వంగా నిలబడిన మట్టికోట… దాని మధ్యన ఉన్న శిథిలావస్థకు చేరిన శివాలయం… ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయింది. 800 ఏండ్లనాటి కాకతీయ కట్టడం నేలమట్టమైంది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న కోటకట్టగా స్థానికులు పిలిచే మట్టికోట శిథిలాల మధ్య ఉన్న కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని మంగళవారం ధ్వంసం చేసి కుప్పపోశారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో శివాలయాన్ని, కాకతీయ చారిత్రక కట్టడాన్ని కూల్చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు శాఖ అనుమతి లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండ చూసుకొని కాంట్రాక్టర్ ఇష్టారీతిగా శిల్పసంపదను విరిచికుప్పపోశారు. ఇటీవలే స్థానికులు శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంతలోనే శివాలయాన్ని కూల్చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు, పురావస్తు శాఖ తమ మాన్యుమెంట్ స్థలంలో ఎవరి అనుమతి తీసుకొని ఇలా నిర్మిస్తున్నారని, అసలు ఆ నిర్మాణం విషయమే తమ నోటీసులో లేదని పేర్కొన్నది. తక్షణమే పనులు ఆపాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సూచించామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
అసలేం జరిగింది?
అశోక్‌నగర్‌లో సైనిక్‌స్కూల్‌ను ఆనుకొని ఉన్న స్థలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పట్టుబట్టారు. దీంతో అధికారులు సైనిక్‌స్కూల్ సు విశాల స్థలంలోని 30 ఎకరాల స్థలాన్ని ఇంటెగ్రేటెడ్ స్కూల్‌కు కేటాయించారు. ఆ స్థలంలో నే 800 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన శివాలయం ఉన్నది. దాని చుట్టూ మట్టికోట ఉన్నది. అది కేవలం శివాలయమే కాకుండా కాకతీయ చరిత్ర, వారసత్వ సంపదకు నెలవైన శిల్పరీతులు, ఘనమైన వారసత్వానికి ప్రతీకగా ప్రతాపరుద్రుడు వేయించిన శాసనం (చరిత్రకారులు దీన్ని అశోక్‌నగర్ శాసనంగా రికార్డు చేశారు) ఉన్నది. చుట్టూ మట్టికోట.. దాని మధ్య ఆలయం.. దీన్ని పునరుద్ధరిస్తే పాఖాల (చెరువు)కు వచ్చే పర్యాటకులు అశోక్‌నగర్‌కు వస్తారని స్థానికులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ భావించింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసమని జేసీబీ, బుల్డోజర్లు దిగాయి. ఇంకేమున్నది.. 800 ఏండ్లనాటి కాకతీయుల చరిత్ర, శిల్ప సంపద, ఘనమైన వారసత్వ కట్టడం రేవంత్ సర్కార్ బుల్డోజర్ కింద పడి ఆనవాళ్లు లేకుండా విరిగిపడింది.
ఎవరికీ తెలియకుండా కట్టడం సమాధి ఎట్లా అయింది?
అశోక్‌నగర్ చారిత్రక, వారసత్వ మట్టికోట, శివాలయం నేలమట్టం ఎలా అయ్యాయనే వి షయంలో ఏ శాఖకు ఆ శాఖ తమది కాదం టే తమది కాదని వాదిస్తున్నాయి. అసలా కట్టడా న్ని నేలమట్టం ఎవరు చేశారనే విషయంలో వి ద్య, ఆర్అండ్బీ, రెవెన్యూ శాఖల అధికారులు ఎవరికివారు తమ దృష్టికిరాలేదంటే తమ దృ ష్టికి రాలేదని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ ఈఈ స్థాయి అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో స్థానిక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ‘ప్రస్తుతానికైతే పనులు ఆపండి. నేను రేపు వచ్చి చూశాక ఏం చేయాలో ఆలోచిద్దాం?’ అని చెప్పటంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ ప్రాంతం నుంచి జేసీబీలను తీసుకొని సంబంధిత కాంట్రాక్టర్ వెళ్లిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు.
చరిత్రకారుల దిగ్భ్రాంతి
కాకతీయ శిల్పకళా సౌరభానికి, తెలంగాణ ఘనమైన వారసత్వ కొనసాగింపునకు ఆలవాలమైన నిర్మాణం నేలమట్టమైందనే విషయం తెలుసుకొని అశోక్‌నగర్ వాస్తవ్యులే కాకుండా చరిత్రకారులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. చారిత్రక కట్టడాలను కూల్చేయడం అత్యంత దయనీయమని కాకతీయ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలక్రమేణ కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంతో, వాటి పునరుద్ధరణ కోసం గతంలో పురావస్తు శాఖ కొన్ని ప్రయత్నాలు చేసినా అవి పూర్తి స్థాయిలో కొనసాగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ వందల ఏండ్లనాటి చరిత్ర చూస్తుండగానే నేలమట్టమైపోయిందని ఆవేదన చెందుతున్నారు.
శాసనం చారిత్రక ప్రాముఖ్యత
గణపతిదేవుని కాలం దాకా కాకతీయ పాలకులు తమను ‘మహామండలేశ్వరులు’గా చెప్పుకొన్నారు. అందుకు ‘రాజాధిరాజ బిరుదు’ సంకేతం. సాధారణంగా అయితే, గణపతిదేవుడిని ‘రాజాధిరాజులు’, ‘మహారాజులు’గా సంబోధించారని చరిత్రకారుల నిర్ధారణ. స్వతంత్ర హోదా: కాకతీయులు మొదట కల్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. రుద్రదేవుడు క్రీ.శ. 1163లో స్వాతంత్య్రాన్ని ప్రకటించినప్పటికీ, శాసనాల్లో పాత బిరుదులే కొనసాగాయి. కానీ, అశోక్‌నగర్ శాసనం వారి సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది. నిర్మాణ శైలి: శాసనం ఉన్న దేవాలయ స్తంభాలు, దూలాలపై శిల్పకళ కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ విధ్వంసాన్ని ఆపండి: శ్రీరామోజు
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ సమీపంలో 800 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన శివాలయాన్ని కూల్చివేయడం పట్ల కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణలో ఉన్న రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలోని శివాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ విధ్వంసాన్ని ఆపాలని, వారసత్వ సంపదను కాపాడాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆ శివాలయాన్ని కూల్చడానికి ఒక్కరోజు కూడా పట్టక పోవచ్చు కానీ, దానిని నిర్మించడానికి మాత్రం ఎండ్లు పడుతాయని పేర్కొన్నారు.
ఇదీ ఆలయ చరిత్ర
కాకతీయుల పాలన అనగానే ముందుగా గుర్తొచ్చేది వారి ఆలయాలు, కోటలు, శిల్ప వైభవం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో కేవలం ఏనుగులు, మానవ వనరులతోనే వారు అద్భుతమైన కట్టడాలను తకువ కాలంలో నిర్మించిన చరిత్ర కండ్లముందు కదలాడుతుంది. అలాంటి అపురూప నిర్మాణాల్లో ఒకటి ఈ శిల్పమందిరం. చరిత్రకారులు, చరిత్ర అధ్యయనశీలురు చేసిన పరిశోధనల్లో అశోక్‌నగర్ శాసనం వెలుగుచూసింది. కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతిదేవుని కాలంలో సోమనాథుడి ఆలయాన్ని (శక సంవత్సరం ప్రకారం 1151లో) నిర్మించారని చరిత్రకారులు తేల్చారు. అనంతర కాలంలో ప్రతాపరుద్రుడు ఈ ఆలయం ప్రాంగణంలో ఒక శాసనం వేయించారని, దీన్నే అశోక్‌నగర్ శాసనంగా పిలుస్తున్నారని చరిత్రకారులు అంటున్నారు.
మాన్యుమెంట్స్ను కూల్చేయడం పెద్ద నేరం
అంత చారిత్రక సంపద కూల్చివేతకు గురైందని తెలిసి తీవ్ర ఆవేదన కలిగింది. సంబంధిత ఏఈ, ఈఈతో మాట్లాడాను. మాకు చెప్పకుండా, మా మాన్యుమెంట్‌ను ఎలా కూల్చేస్తారని అడిగాం. పురావస్తు శాఖ ఆధీనంలోని కట్టడాలను కూల్చేయడం పెద్ద నేరం. ఫీల్డ్‌కు వెళ్లి ఏం జరిగిందో చూసి కనుక్కోమని మా వాళ్లకు చెప్పాం. పూర్వాపరాలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తా. ఒకవేళ కూల్చివేత జరిగిందని తేలితే బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకుంటాం.
-అర్జున్‌రావు, రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్
ప్రభుత్వం తక్షణం దృష్టిసారించాలి
కాకతీయుల వారసత్వ కట్టడాల పరిరక్షణపై పాలకులు, పురావస్తు శాఖ తక్షణం దృష్టి సారించాలి. ఆలయాల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి, పునరుద్ధరణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి. అమూల్యమైన శిల్పసంపద, చారిత్రక, కళాసంపద నేలమట్టమైందని తెలిసి చాలా బాధ కలిగింది. అశోక్‌నగర్ శాసనం, ఆలయాన్ని మేం అనేకసార్లు సందర్శించాం. ఆలయాన్ని డాక్యుమెంట్ చేశాం. కొత్త చరిత్ర నిర్మాణం ఏమో కాని, ఉన్న చరిత్ర నేలమట్టం అవుతున్నది. ప్రభుత్వం తక్షణం దీనిపై దృష్టి సారించాలి.
-అరవింద్ ఆర్య,కార్యదర్శి టార్చ్