హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, సూగూరు గ్రామంలో పురాతన ఆలయం, శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇందులో ఒకటి రాచరికపు ఆహార్యంతో, శైవతాంత్రిక యోగాసనంలో కూర్చున్న పండితుడి విగ్రహం. ఈ విగ్రహానికి కుడిచేత గంటం, ఎడమచేత పుస్తకం కనిపిస్తున్నాయి. ఇది 10,11వ శతాబ్దపు శిల్పంగా భావిస్తున్నారు. ఇకడే మరో అరుదైన శిల్పాన్ని కూడా గుర్తించారు. దీన్ని స్త్రీ ఆత్మాహుతి శిలగా భావిస్తున్నారు.
ఇందులో ఓ స్త్రీ పద్మాసనంలో అంజలిముద్ర పట్టి కూర్చొని ఉంది. తలపై రుద్రాక్షల కిరీటం, భుజాలు, దండరెట్టలు, ముంజేతులకు రుద్రాక్షమాలలు, చెవులకు కుండలాలు కూడా ఉన్నాయి. అర్ధనగ్నంగా ఉన్న ఈ స్త్రీ తలపైన శివలింగం ధరించి ఉంది. సిద్ధిపేట జిల్లా కంచరిమల్యాల, పందిళ్లలో ఈ శిల్పాన్ని పోలిన స్త్రీల ఆత్మాహుతి శిల్పాలను గతంలో గుర్తించినట్లు చరిత్ర బృందం తెలిపింది. ఈ శిల్పం 15వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. ఈ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, బైరోజు చంద్రశేఖర్, బైరోజు శ్యామ్సుందర్ తదితరులున్నారు.