హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): అర్హులైన పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ విజ్ఞప్తిచేసింది. ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ సృజనకు ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఓపీఎస్ పంచాయతీ కార్యదర్శులను జేపీఎస్‌లుగా కన్వర్షన్ చేసి ఓపీఎస్ వ్యవస్థను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. 317 జీవోలో వచ్చిన పంచాయతీ కార్యదర్శులను వారి సొంత జిల్లాలకు డిప్యూటేషన్ చేయాలని, గ్రామ పంచాయతీల్లోని పెండింగ్ చెకులను క్లియర్ చేయాలని, పంచాయతీల నిర్వహణకు నిధులివ్వాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వాణి, కోశాధికారి పండరీనాథ్, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.