Vijaya Dairy | ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీలో అక్షరాల అర కోటి రూపాయలు ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తెలుస్తున్నది. ఇది జరిగి మూడు నెలలు గడుస్తు న్నా ఉన్నతాధికారులు గోప్యత పాటించడం అనుమనాలకు తావిస్తున్నది.
విజయ డెయిరీ తిరుమలగిరి జోనల్ పరిధిలో ఏజెంట్లు, పాల విక్రేతలు, మిల్క్ కార్డుల సొమ్ము సేకరించి, బ్యాంకులో డిపాజిట్ చేసే ఉద్యోగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి నాగరాజు పనిచేసేవాడు. డెయిరీలోనే జూనియర్ మేనేజర్‌గా పనిచేసే అతడి తండ్రి సుదర్శన్ సిఫార్సు మేరకు నాగరాజు ఉద్యోగంలో చేరాడు. నాగారాజు సేకరించిన సొమ్మును బ్యాంకు వాళ్లే కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లేవారు.
ఈ క్రమంలో కొంత మొత్తం మాత్రమే బ్యాంకులో డిపాజిట్ చేస్తూ, కంపెనీ యాప్‌లో తప్పుడు రశీదులు పెడుతూ అధికారులను ఏమార్చేవాడు. మా ర్చి 13న జమ చేసిన సొమ్ములో తేడా ఉంద ని, 15వ తేదీ నుంచి నాగరాజు విధులకు రా వడంలేదని అధికారులు గుర్తించారు. దీనిపై రీజినల్ సేల్స్ మేనేజర్(ఆర్ఎస్ఎం), జోనల్ ఆఫీస్ ఇన్చార్జి ఇద్దరూ కలిసి విచారించి, విక్రేతల నుంచి రావాల్సిన రూ.7,28,760ను సేకరించి, 21వ తేదీన అకౌంట్లో జమచేశా రు.
అనంతరం అకౌంట్స్ విభాగానికి చెందిన అధికారులు నగదు జమకు రశీదులను చూపించాలని కోరగా, 18వ తేదీన ఇదే విషయాన్ని నాగరాజుకు ఆర్ఎస్ఎం తెలిపారు. కేంద్ర కార్యాలయంలోని అకౌంట్స్ విభాగానికి వెళ్లిన నాగరాజు తాను ఏ రోజు వచ్చిన సొమ్ము అదే రోజు బ్యాంకులో జమచేశానని చెప్పినప్పటికీ, రశీదులు సమర్పించలేదు. 23న నాగరాజును కార్యాలయానికి పిలిపించగా, తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఆయన లెక్కల వివరాలను తిరిగి పరిశీలించాలని కోరాడు.
ఆపై ఎన్నిసార్లు నాగరాజును సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందించలేదు. మొత్తం లెక్కలు తనిఖీ చేయగా, రూ.53 లక్షలు తేడా రావడంతో జోనల్ ఆఫీస్ ఇన్చార్జి తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో ఏప్రిల్ 13న ఫిర్యాదు చేశారు. ఘటన జరిగి మూడు నెలలు గడుస్తున్నా అధికారులు గోప్యత పాటిస్తుండడంపై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. డెయిరీలో సొమ్ము స్వాహా ఉదంతంపై రీజనల్ సేల్స్ మేనేజర్ తబిత, జీఎం మల్లికార్జున్లను నమస్తే తెలంగాణ ఫోన్లో సంప్రదించగా, అది అడ్మినిస్ట్రేషన్ వ్యవహారమని తాము చెప్పలేమని చేతులు దులుపుకోవడం గమనార్హం.