చెన్నూర్, సెప్టెంబర్ 30 : ‘మా ఇంటి ఆవరణ చెత్తాచెదారంతో నిండిపోయింది. కంపు వాసన వస్తున్నది. శుభ్రం చేయాలని మున్సిపల్ కార్యాలయం చుట్టూ నాలుగు నెలలుగా తిరుగుతున్న. కానీ, ఎవరూ పట్టించుకుంట లేరు. గింత అధ్వానమా?.. కేసీఆర్ (KCR) పాలనే మంచిగుండె.. ఎక్కడా చెత్త కనిపించకపోయేది. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేటోళ్లు’ అంటూ మంచిర్యాల జిల్లా చెన్నూర్ (Chennur) పట్టణానికి చెందిన లక్ష్మి తెలిపింది. పారిశుద్ధ్య సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు మంగళవారం ఆమె మున్సిపల్ కార్యాలయానికి వచ్చింది. అక్కడ ఆమె మాట్లాడిన మాటలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. ‘మా ఇంటి పరిసరాల్లో చెత్త వేసిన్రు. అపరిశుభ్రంగా మారి దుర్వాసన వస్తున్నది.
పిచ్చి మొక్కలు బాగా పెరిగి పాములు కూడా వస్తున్నయి. వర్షం పడ్డప్పుడల్లా ఇంటి ముం దు మోకాలు లోతు నీళ్లు నిలుస్తున్నయి. మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి అడిగితే కొత్తగా వచ్చిన సారు దగ్గరికి పొమ్మన్నరు. కొత్తసారును కలిసి అడిగితే రాను పో అంటున్నరు. లేకపోతే తెల్లారంగా రా.. సాపు చేయిస్తమంటున్నరు. వృద్ధురాలిని.. ఈ వయసులో చీకట్లో వెళ్లగలనా? మా వాడకు ఎమ్మెల్యే వివేక్ వచ్చినప్పుడు కూడా చెప్పిన. మున్సిపాలిటీ కమిషనర్‌ను నాలుగుసార్లు కలిసిన. ఇప్పటివరకు పట్టించుకున్నోళ్లు లేరు. కేసీఆర్ సర్కారే మంచిగుండె’ అంటూ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.