హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాల్లో పాత టైంటేబుల్‌నే అమలు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్, గురుకుల టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని గురుకులాల్లో 25 శాతం వరకు మెస్‌చార్జీలు పెంచాలని, 010 పద్దు కింద జీతాలివ్వాలని, గురుకుల టీచర్లందరికీ కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో గురుకుల ఉపాధ్యాయులు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు జంగయ్య, చావ రవి, జేఏసీ నాయకులు మామిడి నారాయణ, మధుసూదన్ పాల్గొన్నారు.