నాంపల్లి కోర్టులు, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసిన పంజాగుట్ట పోలీసులు.. ఈ వ్యవహారంలో నిందితులను మరింత లోతుగా విచారించేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల నుంచి మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉన్నదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో నిందితుడైన ఓ మీడియా సంస్థ ప్రతినిధి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని, రెడ్‌కార్నర్ నోటీసులతో వారిని త్వరలో స్వదేశానికి రప్పించి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీంతో పోలీసుల పిటిషన్‌పై బుధవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు కోర్టు ప్రకటించింది.
హైకోర్టులో విచారణ
ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సుమోటోగా కేసు విచారణ జరుపుతున్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రింట్ మీడియా, టీవీలతోపాటు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలతోపాటు రాజకీయ నాయకుల ప్రమేయానికి సంబంధించిన సమాచారాన్ని సమర్పించాలని అధికారులకు స్పష్టం చేసింది.