కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఆగస్టు 26 : జిల్లా ఆబ్కారి శాఖ అదుపుతప్పింది. స్మగ్లింగ్ కేసులో ఏకంగా కోర్టుని, సొంత శాఖ తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఇద్దరు అధికారులతో పాటు కానిస్టేబుల్ పై వేటుపడింది..! తప్పుని కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేసి అడ్డంగా బుక్ అయిన సీఐ..! అధికారిని ఆదుకునే క్రమంలో మరో తప్పు చేసి అటాచ్మెంట్ వేటుకు గురైన సూపరింటెండెంట్..! వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు వారాల క్రితం గంజాయి రవాణా చేస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు.
సీఐ నిర్లక్ష్యం.. నిందితుడి పరార్
సదరు ఇద్దరు అక్రమ రవాణా దారుల పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంచనామా నిర్వహించి భద్రాచలం ఆబ్కారి అధికారులకు అప్పగించారు. అయితే అదే రోజు నిందితులని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించాల్సి ఉండగా ఈ విషయంలో అక్కడి సీఐ నిర్లక్ష్యం వహించి ఇద్దరు నిందితులకు ఒక కానిస్టేబుల్ ని ఎస్కార్ట్ గా పెట్టి స్టేషన్లోనే ఒకరోజు ఉంచారు. ఇదే అదునుగా భావించిన ఇద్దరిలో ఒక నిందితుడు స్టేషన్ నుంచి ఆబ్కారి సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకొని పారిపోయాడు. దీంతో కంగారుపడిన సీఐ ఈ విషయాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చిన పంచనామాను మార్చి, ఇద్దరు నిందితులని కాకుండా ఒకరినే పట్టుకున్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి కోర్టులో హాజరు పరిచినట్లుగా తెలుస్తోంది.
అధికారులపై అవినీతి ఆరోపణలు..
ఈ విషయం ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై రెండు వారాలపాటు విచారణ జరిపిన ఉన్నతాధికారులు భద్రాచలం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సీఐ పై, ఎస్కార్ట్ విధులు నిర్వహించిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లుగా తెలిసింది.
అంతేకాకుండా సదరు సీఐకి సహకరించిన జిల్లా అబ్కారి అధికారిపై సైతం అటాచ్మెంట్ వేటు పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా ఆబ్కారి అధికారి స్థానంలో గతంలో పనిచేసి, ఖమ్మానికి బదిలీపై వెళ్లిన జానయ్యకు భద్రాద్రి కొత్తగూడెం ఇంచార్జ్ ఈఎస్ బాధ్యతలు అప్పగిస్తూ ఆబ్కారి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా జిల్లా ఆబ్కారి శాఖలో పలుచోట్ల అవినీతి రాజ్యమేలుతున్నట్లుగా తెలుస్తోంది.
గతంలో ఎంతోమంది అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు శూన్యం. ఇక జిల్లా ఆబ్కారి అధికారి కార్యాలయానికి నిత్యం ఎంతోమంది బాధితులు తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.
అదేవిధంగా కొన్ని కేసులలో పట్టుబడిన సీజ్డ్ ప్రాపర్టీలను సైతం కొందరు ఆ శాఖకు చెందిన వారే తప్పుదోవ పట్టించినట్లుగా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం భద్రాచలంలో ఎదురైన ఘటన వెలుగులోకి రావడంతో ఈ విషయం బహిర్గతం అయింది. ఆ శాఖలో ఇలాంటి సంఘటనలు కోకోల్లలుగా జరిగినట్లుగా పుకార్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరిగిన ఈ ఘటన సంబంధిత అధికారులు, కానిస్టేబుల్ ను వేటుకు గురి చేసింది.