కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఆగస్టు 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆబ్కారీ శాఖ అదుపుతప్పింది. స్మగ్లింగ్ కేసులో ఏకంగా న్యాయస్థానాన్ని, సొంత శాఖ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఫలితంగా తప్పు చేసిన ఇద్దరు అధికారులపై వేటుపడింది.! తప్పు కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేసి ఎక్సైజ్ సీఐ అడ్డంగా బుక్కవ్వగా.. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి సూపరింటెండెంట్ అటాచ్మెంట్ వేటుకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు వారాల క్రితం గంజాయి రవాణా చేస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంచనామా నిర్వహించి భద్రాచలం అబ్కారీ అధికారులకు అప్పగించారు. అదే రోజు నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించాల్సి ఉంది. కానీ ఈ విషయంలో అక్కడి ఎక్సైజ్ సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇద్దరు నిందితులకు ఒక కానిస్టేబుల్‌ను ఎస్కార్ట్‌గా పెట్టి స్టేషన్లోనే ఒకరోజు ఉంచారు. ఇదే అదునుగా భావించిన ఇద్దరిలో ఒక నిందితుడు స్టేషన్ నుంచి సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు.
నిందితుడి పరారీతో కంగారుపడిపోయిన ఎక్సైజ్ సీఐ ఈ విషయాన్ని.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చిన పంచనామాను మార్చి ఇద్దరు నిందితులను కాకుండా ఒకరినే పట్టుకున్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రెండు వారాలపాటు విచారణ జరిపిన ఉన్నతాధికారులు భద్రాచలం ఎక్సైజ్ సీఐపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. అంతేకాకుండా సీఐకి సహకరించిన సూపరింటెండెంట్‌పై అటాచ్మెంట్ వేటు వేశారని సమాచారం.
ప్రస్తుతం జిల్లా అబ్కారీ అధికారి స్థానంలో గతంలో ఇక్కడ పనిచేసి ఖమ్మం జిల్లాకు బదిలీపై వెళ్లిన జానయ్యకు భద్రాద్రి కొత్తగూడెం ఇంచార్జి ఈఎస్‌గా బాధ్యతలు అప్పగిస్తూ అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా జిల్లా ఆబ్కారి శాఖలో పలుచోట్ల అవినీతి రాజ్యమేలుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఎంతోమంది అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు శూన్యం. ఇక జిల్లా ఆబ్కారి అధికారి కార్యాలయానికి నిత్యం ఎంతోమంది బాధితులు తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. అదేవిధంగా కొన్ని కేసులలో పట్టుబడిన సీజ్డ్ ప్రాపర్టీలను సైతం కొందరు ఆ శాఖకు చెందిన వారే తప్పుదోవ పట్టించినట్లుగా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం భద్రాచలంలో ఎదురైన ఘటన వెలుగులోకి రావడంతో ఈ విషయం బహిర్గతం అయింది. ఆ శాఖలో ఇలాంటి సంఘటనలు కోకోల్లలుగా జరిగినట్లుగా పుకార్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరిగిన ఈ ఘటన సంబంధిత అధికారులను వేటుకు గురి చేసింది.