ఇల్లెందు, అక్టోబర్ 03 : ఇల్లెందు నియోజకవర్గం పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచాయని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం రూ.11 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పేదల ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వాలు పథకాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కేసీఆర్ పాలనలో కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు వచ్చిన ఆర్థిక భరోసాను ఎవరూ మర్చిపోలేరని ఆమె పేర్కొన్నారు.