Sarpanch | మానవపాడు, ఫిబ్రవరి 9 : గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడులో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా ఓ యువకుడు రూ.27.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. నోటిఫికేషన్ రాగానే సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేలా గ్రామపెద్దలు తీర్మానం చేసినట్టు తెలిసింది. వేలంలో వచ్చిన నగదుతో గ్రా మాభివృద్ధికి వినియోగించుకునేలా తీర్మా నం చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై గ్రామస్తులను ఆరాతీయగా గ్రామాభివృద్ధి కోసం చర్చించుకునేందుకే సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
తునికాకు సేకరణ పనులు చేపట్టాలి ; సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తునికాకు సేకరణ పనులను తక్షణమే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఏటా జనవరి నాటికే తునికాకు సేకరణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అటవీశాఖ పూర్తి చేస్తుందని, కానీ ఈ ఏడాది తాత్సారం చేయటంతో ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో అటవీశాఖ చేపట్టే తునికాకు సేకరణపై 10 లక్షల మంది ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఉపాధి కోల్పోకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ ద్వారా తగిన ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు.