Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : అన్నలూ, అక్కలూ ఆల్ ది బెస్ట్.. టెన్షన్ పడకండి.. ఒత్తిడికి గురికాకండి.. మీరే మాకు ఆదర్శం.. పరీక్షలు బాగా రాయండి.. అన్న పోస్టర్లు, ప్లకార్డులు పదో తరగతి విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. 8, 9 తరగతుల విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, గ్రామస్తులు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పే వినూత్న కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టనున్నది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు 5.1 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. వారిలో మనోధైర్యం నింపేందుకు విషెస్ చెప్పించాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇప్పటికే యాక్షన్‌ప్లాన్ రూపొందించి అమలుచేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. కొత్తగా సెంట్రల్ మార్కుల రిజిస్టర్ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహించి విద్యార్థులు సాధించిన మార్కులను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించింది. స్లో లెర్నర్స్ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని వివరించాలని సూచించింది.