Amit shah | హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీ నేతలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌షా ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధిష్ఠానానికి వచ్చిన నివేదికలను వారి ముందు పెట్టి గట్టిగా తలంటినట్టు తెలిసింది. రాష్ట్ర నాయకత్వంలోని కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, లక్ష్మణ్ వంటి కీలక నేతల మధ్య తీవ్ర సమన్వయ లోపం ఉన్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో పార్టీకి ఆదరణ ఉన్నదని రాష్ట్ర నేతలు చెప్పేందుకు ప్రయత్నించగా.. అసెంబ్లీ ఎన్నికలు, హైదరాబాద్ మేయర్ ఎన్నికల సమయంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా పార్టీకి ఆదరణ ఉన్నదా? అని అమిత్ షా ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. ఏడాది కాలంలో రాష్ట్రంలో నిర్వహించిన ఏ సభ సక్సెస్ అయ్యిందో చెప్పాలని, పార్టీలో చేరిన ప్రజాదరణ కలిగిన నేతను చూపించాలని అడిగినట్టు తెలిసింది. రాష్ట్రం లో మిషన్ 90 (90 సీట్లు గెలవటం) అని కేంద్రం చెప్పిందని, కానీ పరిస్థితి చూస్తుంటే ఉన్న రెండు మూడు కూడా మళ్లీ గెలిచే పరిస్థితి లేదని అనుమానం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఇప్పటికైనా సమన్వ యం చేసుకోవాలని అమిత్‌షా సూచించినట్టు తెలుస్తున్నది.