సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 5 : సిరిసిల్ల నేతన్న నైపుణ్యానికి అమెరికాకు చెందిన చేనేత పరిశోధకురాలు కైరా జాఫ్పీ అబ్బురపడ్డారు. ‘వాట్ ఏ సర్ప్రైజ్’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాంట్‌తో ఆసియా దేశాల్లో చేనేత సంబంధిత రంగాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్న ఆమె సోమవారం సిరిసిల్లలో పర్యటించారు.
రాష్ట్రంలోని పోచంపల్లి, గద్వాల్, జనగామలోనూ పర్యటించనున్నారు. సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని, సిరిసిల్లలో నేతన్నలతో సమావేశమయ్యారు. పలువురు చేనేత కార్మికుల మగ్గాలను, వారు నేస్తున్న వస్ర్తాలను, చేనేత నైపుణ్యానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రముఖ వెల్దండి హరిప్రసాద్ రూపొందించిన చేనేత ఉత్పత్తులను, అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి కైరా అబ్బురపడ్డారు. ఇంత నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను తాను ఇంతవరకు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఆమె వెంట తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టైక్స్‌టైల్ అధికారులు ఉన్నారు.