అమీన్పూర్ (జిన్నారం), ఏప్రిల్ 5 : ఒకప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు వివిధ రకాల పక్షులు, చేపలు, మొక్కలతో కళకళలాడేది. అరుదైన జీవవైవిధ్య సంపద కలిగిన చెరువుగా పేరుగాంచింది. శీతాకాలంలో సుమారు 100 రకాల విదేశీ పక్షులు వలస వచ్చేవి. విదేశాల నుంచి స్టార్ ఫొటోగ్రాఫర్లు ఏటా ఇక్కడికి వచ్చి అరుదైన పక్షుల ఫొటోలు తీసేవారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ చెరువు అభివృద్ధికి ప్రత్యేక కృషిచేసింది. ప్రస్తుతం ఈ చెరువు కాలుష్య కాసారంగా మారింది. అలనాటి జీవ వైవిధ్యం నేడు కనిపించడం లేదు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువుకు 300 ఏండ్ల చరిత్ర ఉన్నది. ఇది 93 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. దీనికింద వెయ్యి ఎకరాల వరకు పంట సాగు అయ్యేది. దేశంలోనే మొట్టమొదటి జీవ వైవిధ్య సరస్సుగా ఈ చెరువుకు పేరున్నది. పక్షులు, జీవ వైవిధ్య రాశులకు ఈ చెరువు నిలయంగా ఉండేది. ఏటా చలికాలంలో ఫ్లెమింగో వంటి అరుదైన పక్షులు, అందమైన కొంగలతోపాటు మరో యాభై రకాల వివిధ పక్షులు వలస వచ్చేవి.
ఈ పెద్ద చెరువులో 171 రకాల పక్షులు, 250 జాతుల అరుదైన మొక్కలు, 9 రకాల చేపలు, 41 రకాల సీతాకోక చిలుకలు, 23 రకాల పాకే జంతువులు, 21 రకాల కీటకాలు ఉన్నట్టు తెలంగాణ బయో డైవర్సిటీ బోర్డు గుర్తించింది. దీంతో 2016 నవంబర్‌లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ‘జీవ వైవిధ్య వారసత్వ సంపద’గా పెద్ద చెరువు గుర్తింపు పొందింది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఈ చెరువును కేసీఆర్ ప్రభుత్వం భారీగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ చెరువు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రక్షణలో ఉన్నది. ఇంతటి పేరుగాంచిన పెద్ద చెరువు నేడు ఉనికి కోల్పోతున్నది.
ప్రస్తుతం అమీన్పూర్ ప్రాంతం చాలా అభివృద్ధ్ది చెందింది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పాటై, ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విలీనమైంది. రెండు లక్షలకుపైగా జనాభా ఉన్నది. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు ఇక్కడ జీవనాన్ని సాగిస్తున్నారు. 200కుపైగా కాలనీలు ఏర్పడ్డాయి. అమీన్పూర్ నడి బొడ్డున ఉన్న పెద్ద చెరువు చుట్టూ వేగంగా అభివృద్ధ్ది జరిగింది. కాలనీల్లోని కలుషిత నీరు చెరువులోకి చేరుతున్నది. డ్రైనేజీ నీరు చెరువులోకి వస్తుండటంతో చెరువు కాలుష్యంగా మారుతున్నది. దీని కింద ఉన్న పంట పొలాలు నివాసాలకు నిలయంగా మారాయి. వందల సంఖ్యలో అపార్టుమెంట్లు వెలిశాయి.
దీంతో చెరువులోని నీరు కిందికి ప్రవహించే పరిస్థితి లేదు. తూమును కూడా మూసివేసి ఉంచారు. చెరువులోని నీరు ఎప్పటికప్పుడు శుభ్రమయ్యే పరిస్థితి లేదు. ఐదేండ్ల నుంచి చెరువు ఎండిపోకపోవడంతో కొత్త నీరు వచ్చే పరిస్థితి లేదు. కాలుష్య జలాల ప్రవాహం ఉండటంతో విలువైన జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ఐదేండ్ల నుంచి వలస పక్షులు రావడం లేదు. పిచ్చి మొక్కలు భారీగా పెరిగాయి.
కేవలం క్యాట్‌ఫిష్ మాత్రమే ఉండటంతో అవి ఇతర చేపలను బతుకనివ్వడం లేదని మత్స్య కారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 200 మత్స్యకారుల కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నాయి. జీవ వైవిధ్యానికి చిరునామాగా పేరుగాంచిన పెద్ద చెరువుకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు, ప్రజలు, మత్స్యకారులు కోరుతున్నారు.
చెరువును ఖాళీ చేసి కొత్త నీరు వస్తేనే చేపలు, ఇతర జీవరాశులకు బాగుంటుంది. ప్రస్తుతం చేపలు సరిగా ఎదగడం లేదు. డ్రైనేజీనీరు వస్తుండటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. చెరువులో గుర్రపు డెక్క, ఇతర పిచ్చి మొక్కలు బాగా పెరిగాయి. వీటిని తొలగించాలి. ఈ చెరువుకు పూర్వవైభవం తీసుకురావాలి.
– కొల్లూరి యాదగిరి, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు అమీన్పూర్