హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రతిష్ఠించనున్న దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు. ట్యాంక్‌బండ్ సమీపంలో 11.5 ఎకరాల్లో తీర్చిదిద్దుతున్న అంబేద్కర్ స్మృతివనంతోపాటు విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ పనులు 90 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. విగ్రహం అడుగు భాగంలో చుట్టూ పార్లమెంట్ తరహా ఎలివేషన్ ఉంటుందని, అంబేదర్ ఫొటోగ్యాలరీ, స్మృతివనం, సెంట్రల్ లైబ్రరీ, ఫౌంటేన్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశాల మేరకు బాబాసాహెబ్ గొప్పతనాన్ని చాటేలా పనులు సాగుతున్నాయని చెప్పారు. ఏప్రిల్‌లో అంబేదర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు మంత్రి కొప్పుల వెల్లడించారు.
నేడు అమెరికాకు మంత్రి కొప్పుల
ఇన్స్టిట్యూషనల్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అమెరికాలోని నార్త్ సాల్ట్‌లేక్ సిటీలో నిర్వహించనున్న రూట్స్ టెక్-2023 ఎక్స్‌పోలో పాల్గొనేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం అమెరికా వెళ్లనున్నారు. అదేవిధంగా ల్యాటర్ డిసెన్స్ (ఎల్డీఎస్ ) స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంత్రిని కలువనున్నారు. తెలంగాణ రాష్ర్టానికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై చర్చించనున్నట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.